బాబు మాట‌ల్లో... బిల్ గేట్స్ గ్రేట్ నెస్ ఇదే!

బాబు మాట‌ల్లో... బిల్ గేట్స్ గ్రేట్ నెస్ ఇదే!

బిల్ గేట్స్‌... ప్ర‌పంచ దేశాల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఓ సాధార‌ణ యువ‌కుడిగా ఉండ‌గానే త‌న‌కు వ‌చ్చిన ఆలోచ‌న‌ల‌ను కార్య‌రూపంలోకి తీసుకొచ్చేసి ఓ చిన్న సంస్థ‌ను స్థాపించిన గేట్స్‌... ఆ త‌ర్వాత దానికి ప్ర‌పంచంలోని అన్ని దేశాల‌కు సుప‌రిచిత‌మైన సంస్థ‌గా తీర్చిదిద్దారు. గేట్స్ చేతుల్లో పురుడు పోసుకున్న మైక్రోసాఫ్ట్ ఇప్పుడు ప్ర‌పంచంలోని అన్ని దేశాల‌తోనూ పెనవేసుకుపోయింది. కంప్యూట‌ర్ యుగంలో మైక్రోసాఫ్ట్ అధ్య‌యాన్ని సువ‌ర్ణ‌యుగంగానే పిల‌వాలేమో. ఎందుకంటే... కంప్యూట‌ర్ రంగం గురించి మాట్లాడాలంటే... మైక్రోసాఫ్ట్ పేరును ప్ర‌స్తావించ‌కుండా ఉండలేం. సంస్థ పేరు ప్ర‌తిష్ఠ‌ల‌తో పాటు ఆ సంస్థ వ్య‌వస్థాప‌కుడిగా బిల్ గేట్స్ అప‌ర కుబేరుడిగా ఎదిగారు. ఇత‌రుల‌కు ఉప‌దేశాలు ఇచ్చేముందు తానే ఎందుకు పాటించ‌కూడ‌ద‌న్న భావ‌న‌తో... రిటైర్‌మెంట్ వ‌య‌సు రాగానే సంస్థ రోజువారీ కార్య‌క‌లాపాల నుంచి గేట్స్ త‌ప్పుకున్నారు. ఇప్పుడు ఆ సంస్థ మ‌న తెలుగు నేల‌కు చెందిన స‌త్య నాదెళ్ల ఆధ్వ‌ర్యంలో అప్ర‌తిహాతంగా కొన‌సాగుతోంది.

ఇక మైక్రోసాఫ్ట్ లాభాల ద్వారా ప్ర‌పంచ కుబేరుడిగా మారిపోయిన గేట్స్‌... ఆ సంప‌ద‌ను ఏం చేశారు, చేస్తున్నార‌న్న విష‌యానికి వ‌స్తే ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు వెలుగు చూడ‌క మాన‌వు. త‌న పేరుతో పాటు భార్య మిలిండా గేట్స్ పేరును క‌లిపేసి గేట్స్ మిలిండా ఫౌండేష‌న్‌ను ఏర్పాటు చేసిన గేట్స్‌... త‌న ఆస్తిపాస్తుల్లోని మెజారిటీ వాటాను దానికే రాసిచ్చేశారు. ఆస్తుల‌ను రాసివ్వ‌డ‌మే కాకుండా ఆ నిధులు స‌క్ర‌మ మార్గంలో ఖ‌ర్చు అయ్యేలా.. గేట్స్ మొత్తం ఫౌండేష‌న్ వ్య‌వ‌హారాల‌ను  ద‌గ్గ‌రుండి మ‌రీ ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఇప్ప‌టికే ఆఫ్రికాలోని ప‌లు నిరుపేద దేశాల్లో గేట్స్ ఫౌండేష‌న్ కార్య‌క‌లాపాలు ముమ్మ‌రంగా సాగుతున్నాయి. తెలుగు నాట కూడా చాలా కాలం క్రిత‌మే గేట్స్ ఫౌండేష‌న్ ఎంట్రీ ఇచ్చినా... ఇప్పుడు నవ్యాంధ్రలో రైతుల‌కు సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని అందించే బృహ‌త్కార్యాన్ని భుజాల‌కెత్తుకుంది. ఇందులో భాగంగా విశాఖ‌ప‌ట్ట‌ణంలో గ‌డ‌చిన మూడు రోజులుగా జ‌రుగుతున్న అగ్రిటెక్‌-2017 స‌ద‌స్సు నేటి మ‌ధ్యాహ్నం ముగిసింది. ఈ స‌ద‌స్సు ముగింపు స‌మావేశానికి గేట్స్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా గేట్స్‌... సాగులో ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని చొప్పించ‌డం ద్వారా ఒన‌గూడే లాభాల‌ను వివ‌రించారు. ఆ త‌ర్వాత మైకందుకున్న ఏపీ సీఎం చంద్ర‌బాబు... గేట్స్ గురించి చాలానే మాట్లాడారు. గేట్స్‌తో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న బాబు... గేట్స్ ఎంత‌టి ఉదాత్త వేత్తో చెప్ప‌క‌నే చెప్పారు.  గేట్స్‌లోని ప్ర‌తి కోణాన్ని త‌న‌దైన శైలిలో ఆవిష్క‌రించే య‌త్నం చేసిన చంద్ర‌బాబు... నిజంగానే గేట్స్‌ను ఆకాశానికెత్తేశార‌నే చెప్పాలి.

గేట్స్ గురించి చంద్ర‌బాబు నోట ప‌లికిన మాట‌లు కొంద‌రికి అతిశ‌యోక్తి అనిపించినా కూడా... ఆ మాట‌ల్లో వాస్త‌వం లేక‌పోలేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అయినా గేట్స్ గురించి చంద్ర‌బాబు ఏమ‌న్నార‌న్న విష‌యానికి వ‌స్తే... *విశాఖలో గేట్స్‌కు స్వాగతం పలకడం ఆనందంగా ఉంది. విశాఖ అందమైన, స్వచ్ఛమైన నగరం. మొదటిసారిగా ఢిల్లీలో బిల్‌గేట్స్‌ను కలిసినప్పుడు నాకు పది నిమిషాలు సమయం ఇచ్చారు. 10 నిమిషాలు సమయం ఇచ్చినా.. నేను ఇచ్చిన ప్రజెంటేషన్‌ మెచ్చి 40 నిమిషాలకు పైగా సమయం కేటాయించారు. ప్రతి ఒక్కరూ డబ్బులు సంపాదిస్తారు.. కొందరు మాత్రమే అర్ధవంతంగా ఖర్చు చేస్తారు. బిల్‌గేట్స్‌ తన సంపాదనలో ఎక్కువ భాగం సమాజం కోసం ఖర్చు చేస్తున్నారు. తన సంపాదనలో వారసులకు ఇచ్చింది చాలా తక్కువ భాగం. ఇలా క‌ష్ట‌ప‌డి పోగేసిన సంప‌ద‌ను వార‌సులకు కాకుండా త‌న‌తో ఏమాత్రం సంబంధం లేని వారి కోసం ఖ‌ర్చు చేయ‌డం చాలా గొప్ప విష‌యం. ఇందులో గేట్స్‌ను మించిన వారు లేరు. 20 ఏళ్ల క్రితం అమెరికాలో కాక్‌టైల్ పార్టీలో త‌న‌ను క‌ల‌వ‌మ‌ని గేట్స్ నాకు చెప్పారు. అయితే ఈ క‌ల‌యిక‌ రాజకీయంగా ఇబ్బంది ఉంటుందని నేను వెన‌క‌డుగు వేశాను. దీంతో గేట్స్ నాతో విడిగా సమావేశమయ్యారు* అని చంద్ర‌బాబు పేర్కొన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు