బాబు మాట!... అమ‌రావ‌తి ఇక ఆగ‌దు!

బాబు మాట!... అమ‌రావ‌తి ఇక ఆగ‌దు!

న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం గురించి ఓ ఆస‌క్తిక‌ర విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. సీఎం చంద్ర‌బాబు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న ఈ న‌గ‌ర నిర్మాణంపై ఇప్ప‌టి వ‌ర‌కు అనేక నీలి నీడ‌లు అలుముకున్నాయి. ముఖ్యంగా ఇక్క‌డ ప‌ర్యావ‌ర‌ణం పాడ‌య్యేలా ప్ర‌భుత్వం నిర్మాణాలు సాగిస్తోంద‌ని, రాజ‌ధానికి వ‌ర‌ద గండం పొంచి ఉంద‌ని, రైతుల‌కు న్యాయం చేయ‌కుండానే ప్ర‌భుత్వం భూములు సేక‌రించింద‌ని.. ఇలా.. అనేక విష‌యాల‌పై జాతీయ హ‌రిత ట్రిబ్యున‌ల్ వ‌ద్ద కేసులు న‌డిచాయి. కొంద‌రు రైతులే నేరుగా ట్రిబ్యున‌ల్‌ను ఆశ్ర‌యించ‌గా.. మ‌రికొంద‌రు స్వ‌చ్ఛంద సంస్థ‌ల నిర్వాహ‌కులు కూడా ట్రిబ్యున‌ల్‌ను ఆశ్ర‌యించారు. వీట‌న్నింటిపైనా కొన్ని నెల‌లుగా విచార‌ణ‌లు జ‌రిగాయి.

ఈ క్ర‌మంలోనే అనేక‌సార్లు ప్ర‌భుత్వానికి ట్రిబ్యున‌ల్ ప్ర‌శ్న‌లు సంధించింది. కొండ‌వీటి వాగు ప‌రిస్థితి పైనా నివేదిక కోరింది. అంతేకాదు, భూకంపాలు వ‌చ్చే జోన్‌లో ఉన్నందున ప‌రిస్థితి ఏమిట‌ని నిల‌దీసింది. ఇక‌, రైతుల విష‌యాన్ని కూడా ప్ర‌శ్నించింది. ఇలా అనేక విష‌యాల్లో ప్ర‌భుత్వానికి ఎదురు దెబ్బ‌లు త‌గిలాయి. దీంతో రాజ‌ధాని నిర్మాణంలో తీవ్ర జాప్యం జ‌రుగుతూవ‌స్తోంది. మ‌రోప‌క్క‌, వీటి నిర్మాణాల‌కు సంబంధించి డిజైన్ల‌ను కూడా ఇంకా ఆమోదించ‌లేదు. ఒక‌వేల డిజైన్లు ఆమోదం పొందినా.. కూడా .. ట్రిబ్యున‌ల్ మెలిక ఉన్న నేప‌థ్యంలో ఇప్ప‌టి వ‌ర‌కు శంకు స్థాప‌న‌ల‌కే నిర్మాణాలు ప‌రిమితం అయ్యారు. ఇలా ఉన్న న‌వ్యాంధ్ర రాజ‌ధాని నిర్మాణానికి సంబంధించి ట్రిబ్యున‌ల్ నుంచి తీపి క‌బురు అందింది.

ఇదే విష‌యాన్ని సీఎం చంద్ర‌బాబు మీడియాకు వెల్ల‌డించారు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో భేటీలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పును సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. రాజధాని నిర్మాణానికి అనుకూలంగా ఎన్జీటీ తీర్పు ఇచ్చిందని, రాజధాని నిర్మాణంలో ఇది శుభ పరిణామమని సీఎం చంద్రబాబు అన్నారు. ఇక నుంచి రాజధాని పనులు వేగంగా జరుగుతాయన్నారు. మొదటి నుంచి నిబంధనలకు అనుగుణంగానే ముందుకు వెళ్తున్నామని సీఎం పేర్కొన్నారు. అమరావతి ప్రాంతంలో ఉన్న వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ రాజధానిని నిర్మిస్తామన్నారు. దీంతో త్వ‌ర‌లోనే రాజ‌ధాని ప‌నులు ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌ని అధికారులు చెబుతున్నారు. సో.. ఇక‌.. బాబు క‌ల‌లు తీర‌నున్నాయేమో.. చూడాలి! 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు