ఎలా పిల‌వాలో క్లారిటీ ఇచ్చిన నిర్మ‌ల‌

ఎలా పిల‌వాలో క్లారిటీ ఇచ్చిన నిర్మ‌ల‌

కొంద‌రు కొన్ని ప‌ద‌వుల్లోకి ఇట్టే ఒదిగిపోతారు. ర‌క్ష‌ణ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన కేంద్ర‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ కూడా అంతే.. ప‌ద‌విని చేప‌ట్టిన నాటి నుంచి ఆమె త‌న‌కిచ్చిన బాధ్య‌త‌ను నూటికి నూరుపాళ్లు నెర‌వేర్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆమె చురుకుద‌నం డ్రాగ‌న్ దేశానికి సైతం చురుక్కుమ‌నిపించింది. ర‌క్ష‌ణ మంత్రిగా వ్య‌వ‌హ‌రించే వారిలో ఉండే సంకోచం.. ఆచితూచి అడుగులే వేసే తీరుకు ఈ తెలుగింటి కోడ‌లు పూర్తి విరుద్ధం.

చేయాల‌నుకున్న ప‌నిని ఇట్టే చేసేసే ఆమె.. జంకు లేకుండా ముందుకెళుతున్నారు. పోలీస్‌.. ఆర్మీ విభాగాల్లో క‌నిపించ‌ని బాసిజం ఉంటుంద‌న్న విమ‌ర్శ ఉంది. దీనికి క్ర‌మ‌శిక్ష‌ణ అని అందంగా పేరు పెట్టి.. త‌మ‌కు కావాల్సిన ప‌నుల్ని చేయించుకుంటార‌న్న ఆరోప‌ణ ఉంది.

అయితే.. ఇలాంటి వాటికి చెక్ పెట్ట‌టంతో పాటు.. త‌న‌కు అన‌వ‌స‌రంగా మ‌ర్యాద‌లు ఇచ్చే తీరుకు నిర్మ‌లా సీతారామ‌న్ పూర్తి వ్య‌తిరేకం. అందుకే ఆమె.. త‌న‌ను మేమ్ సాబ్‌.. స‌ర్‌.. మేడ‌మ్‌.. లాంటి ప‌దాల‌కు చాలా దూరం. అయితే.. నిర్మ‌లాను ఎలా పిల‌వాల‌న్న డైల‌మా సైనిక వ‌ర్గాల్లో ఉంది. ఈ విష‌యాన్ని అర్థం చేసుకున్న ఆమె.. స్వ‌యంగా త‌న‌ను ఎలా పిల‌వాల‌న్న దానిపై క్లారిటీ ఇచ్చేశారు.

ఇక‌పై త‌న‌ను మేడ‌మ్ సాబ్ అని పిల‌వొద్ద‌ని.. ర‌క్షా మంత్రి అని వ్య‌వ‌హ‌రించాల‌ని కోరారు. నిర్మ‌లా సీతారామ‌న్ ను ఎలా పిల‌వాల‌న్న దానిపై ఉన్న సందిగ్థ‌త‌ను తేల్చేసిన నిర్మ‌ల తీరుపై ఆర్మీ అధికారులు సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ‌కున్న ఇబ్బందిని గుర్తించి ఆమెకు ఆమే స్వ‌యంగా స్ప‌ష్ట‌త ఇవ్వ‌టం బాగుంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు