మీడియాలో ముదిరిన మెట్రో రైల్ వార్‌!

మీడియాలో ముదిరిన మెట్రో రైల్ వార్‌!

గ‌డిచిన కొద్దిరోజులుగా తెలుగు ప‌త్రిక‌ల్ని చూస్తే.. అగ్ర‌ప‌త్రిక‌లుగా చెప్పే కొన్ని మీడియా సంస్థ‌ల్లో వ‌స్తున్న వార్త‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. మ‌రో రెండు వారాల్లో హైద‌రాబాద్ మెట్రో రైల్ ప్రారంభం కానుంది. ప్ర‌భుత్వ‌.. ప్రైవేటు భాగ‌స్వామ్యంతో భారీ ఎత్తున నిర్మిస్తున్న మెట్రోరైల‌/ ప‌్రాజెక్టును ప్రారంభించ‌టానికి ప్ర‌ధాని మోడీ ఈ నెల 28న వ‌స్తున్న‌ట్లుగా చెబుతున్నారు.అయితే.. ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌ధాని కార్యాల‌యం నుంచి ప్రారంభోత్స‌వానికి  వ‌స్తున్నామంటూ స‌మాచారం వ‌చ్చింది లేదు. ఇదే విష‌యాన్ని సోమ‌వారం అసెంబ్లీ స‌మావేశాల్లో మంత్రి కేటీఆర్ కూడా చెప్పుకొచ్చారు.

ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. ఇప్పుడు మెట్రో రైలుకు సంబంధించి ప్ర‌ముఖ మీడియా సంస్థ‌లైన ఈనాడు..ఆంధ్ర‌జ్యోతిల మ‌ధ్య పెద్ద వార్ న‌డుస్తోంది. అది అంత‌కంత‌కూ ముదురుతోంది. పోటీ నేప‌థ్యంలో ఒక‌రి కంటే మ‌రొక‌రు మెరుగ్గా ఉండాల‌న్న త‌ప‌న ఇరువురిలో క‌నిపిస్తోంది. ఇలా సాగుతున్న వార్ లోకి ఇంగ్లిషు దిన‌ప‌త్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా చేరింది.
కొద్దిరోజుల క్రితం వ‌ర‌కూ మెట్రో క‌థ‌నాల్ని ఆంధ్ర‌జ్యోతి మినీలో ప్ర‌చురించ‌గా.. అందుకు బ‌దులు అన్న‌ట్లుగా ఈనాడు మొయిన్ ఎడిష‌న్ లో భారీ ప్లేస్ మెంట్ తో వార్త‌లు ఇవ్వ‌టం మొద‌లైంది. దీనికి ధీటుగా అన్న‌ట్లు ఆంధ్ర‌జ్యోతి మొద‌టి పేజీలో మెట్రో రైల్ వార్త‌ల్ని ఇవ్వ‌టం షురూ చేసింది. మ‌న మెట్రోకు డ్రైవ‌ర్ ఉండంటూ ఇచ్చిన వార్త ఈనాడు వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేప‌టంతో పాటు.. మెట్రో క‌థ‌నాల విష‌యంలో ఎందుకు వెనుక‌బ‌డిపోయామ‌న్న చ‌ర్చ జ‌రిగిన‌ట్లు స‌మాచారం.

దీంతో.. ఆ వార్త‌కు ఖండ‌న అన్న‌ట్లు.. మెట్రో రైలుకు డ్రైవ‌ర్లు ఉంటార‌న్న అర్థం వ‌చ్చేలా భారీ వార్త‌ను అచ్చేసింది ఈనాడు. వాస్త‌వానికి ఒక సంస్థ ప్ర‌చురించిన వార్త‌కు ఖండ‌న‌గా పోటీ ప‌త్రిక మ‌రో క‌థ‌నాన్ని అచ్చేయ‌టం చాలా అరుదు. అందులోకి ఈనాడు లాంటి మీడియా సంస్థ అలాంటి ప‌నులు చేయ‌ద‌న్న పేరుంది. ఇందుకు భిన్నంగా ఈ వార్త రావ‌టంపై సోష‌ల్ మీడియాలోనూ.. మీడియా వ‌ర్గాల్లోనూ భారీ చ‌ర్చ జ‌రిగింది.

నిజానికి మెట్రో రైలుకు డ్రైవ‌ర్ ఉండ‌రు. క‌మాండ్ కంట్రోల్ స్టేష‌న్ ద్వారా ట్రైన్‌ను నియంత్రిస్తుంటారు. అయితే.. ఆ విష‌యాన్ని ఆంధ్ర‌జ్యోతి ముందు చెప్పింద‌న్న బాధ‌తోనో.. ఆక్రోశంతోనో కానీ ఈనాడులో ఖండ‌న వార్త వేశారు. విష‌యం ఇక్క‌డితో ఆగితే బాగుండేది. కానీ. .కొద్దిరోజుల్లోనే.. మెట్రోకి డ్రైవ‌ర్ ఉండ‌రంటూ ఈనాడులో వ‌చ్చిన వార్త సోష‌ల్ మీడియాలో కామెడీగా మారింది.
అదే స‌మ‌యంలో.. ఆంధ్ర‌జ్యోతిలో రోజుకో భిన్న‌మైన క‌థ‌నం మెట్రోరైల్ మీద రావ‌టం ఈనాడు వ‌ర్గాల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంద‌ని చెబుతున్నారు. వ‌రుస‌గా ఎక్స్ క్లూజివ్ ల‌తో వెళుతున్న ఆంధ్ర‌జ్యోతిని అందుకోవ‌టానిక‌న్న‌ట్లు ప్ర‌త్యేక క‌థ‌నాల పేరిట ఈ రోజు (మంగ‌ళ‌వారం) మొద‌టి పేజీలో ఇండికేష‌న్ ఇచ్చారు. అంత ప్ర‌త్యేక క‌థ‌నాలు ఏమిట‌న్న‌ది చూస్తే.. ఆంధ్ర‌జ్యోతిలో ఇప్ప‌టికే ప‌బ్లిష్ అయిన అమీర్ పేట స్టేష‌న్ గురించి.. మెట్రో ఛార్జీల‌ను ప‌ది రోజుల్లో ప్ర‌క‌టిస్తార‌న్న వార్త‌తో పాటు.. మెట్రో రైల్ లో ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్నార‌న్న ఒక  స్పాట్ వార్త‌ను అచ్చేశారు. క్రైమ్ వార్త‌ను మిన‌హాయిస్తే.. మిగిలిన రెండు జ్యోతిలో అంత‌కు ముందు వ‌చ్చిన‌వే.

తెలుగు మీడియా సంస్థ‌లో పోటాపోటీగా క‌థ‌నాలు సాగుతున్న వేళ‌.. టైమ్స్ సైతం.. ఈ రోజు  ఎక్స్ క్లూజివ్  అంటూ నాగోల్ స్టేష‌న్ ఫోటోలు వేసి.. క‌థ‌నం అచ్చేసింది. నిజానికి ఇదే త‌ర‌హా క‌థ‌నం మొన్న ఆదివారం ఆంధ్ర‌జ్యోతిలో పేజీ నిండుగా.. వివ‌రంగా ఇచ్చేశారు. విలువ‌ల‌కు పెద్ద‌పీట వేస్తామ‌ని త‌ర‌చూ చెప్పుకునే ఈనాడులో ప్ర‌త్యేక క‌థ‌నాలంటూ హ‌డావుడి చేయ‌టం.. టైమ్స్ ఎక్స్ క్లూజివ్ అంటూ పాత వార్త‌ల్ని కొత్త‌గా ప్ర‌జెంట్ చేయ‌టం చూస్తే.. పేప‌ర్లు చ‌దివే పాఠ‌కుల్ని ఆయా ప‌త్రిక‌లు ఏమ‌నుకుంటున్నాయ‌న్న భావ‌న క‌లుగ‌క మాన‌దు. ఇప్ప‌టివ‌ర‌కైతే మెట్రో  రైలు వార్త‌ల విష‌యంలో ఆంధ్ర‌జ్యోతి ముందుంది. ఆ విష‌యంలో మ‌రో మాట లేదు. మ‌రి.. రేప‌టి నుంచి ఎలా ఉంటుందో తెలీదు. ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ల మ‌ధ్య మొద‌లైన మెట్రో రైల్ వార్త‌ల పోటీ ఎక్క‌డి వ‌ర‌కు వెళుతుంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారిందని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు