ఏపీలో కొత్త రాజకీయ పార్టీ?

ఏపీలో కొత్త రాజకీయ పార్టీ?

ఏపీలో కొత్త రాజకీయ పార్టీ పురుడుపోసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు... ఆ పార్టీ మాజీ నేతలు కొందరు కలిసి మరికొందరు ప్రభావవంతమైన నేతలతో కలిసి రాజకీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు చురుగ్గా సమాలోచనలు చేస్తున్నారు. అయితే... ఈ కొత్త పార్టీని కొత్త సామాజిక కాంబినేషన్లో తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఉత్తర ప్రదేశ్ లో మాయావతి ఫార్ములా తరహాలో కాపులు, దళితుల కాంబినేషన్లో రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా కదులుతున్నారు.
   
తాజాగా కాపు నేత ముద్రగడ పద్మనాభం సొంతూరు కిర్లంపూడిలో కాపుల నివాస ప్రాంతంలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని ముద్రగడతో పాటుగా కేంద్ర మాజీమంత్రి చింతామోహన్‌, మాజీ ఎంపీ జివి.హర్షకుమార్‌ ఆవిష్కరించారు. ఇది ఏపీ రాజకీయాల్లో చర్చనీయంగా మారింది. ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా గరగపర్రులో అంబేద్కర్‌ విగ్రహాన్ని పెత్తందార్లు తొలగించిన నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని కిర్లంపూడిలో కాపుల నివాస ప్రాంతాల్లో కాపులే అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వెనుక రాజకీయ కారణాలు కనిపిస్తున్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇది కొత్త పార్టీ ఏర్పాటుకు తొలి అడుగు అన్న ప్రచారం మొదలైంది.
   
అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు ద్వారా తాము దళితులతో సఖ్యత కోరుకుంటున్నామనే సందేశాన్ని ఇవ్వడానికే ముద్రగడ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీల్లోని కాపు సామాజిక తరగతికి చెందిన నాయకులను ముద్రగడ కలిశారు. కాపులను బిసిల్లో చేర్చే విషయంలో ఆయన అన్ని పార్టీల కాపు నాయకులనూ కలిశారు.  మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని యూనివర్సిటీల్లోని ప్రొఫెసర్లతోనూ రాజమండ్రిలో శనివారం హర్షకుమార్‌ భారీ సదస్సు నిర్వహించారు. దళితులు ఐక్యంగా ఉంటే రానున్న ఎన్నికల్లో రాజ్యాధికారం దళితులదేనని ఆ సదస్సులో కేంద్ర మాజీమంత్రి మోహన్‌ కొత్త పార్టీ ఆలోచనను తెరపైకి తెచ్చారు. అంతేకాదు.. తూర్పు నుంచే సిఎం వస్తారని, ఉత్తరప్రదేశ్‌ మాదిరిగా రాష్ట్రంలో మాయావతి ఫార్ములాను అమలు చేస్తామని చింతామోహన్‌ ఆ సమావేశంలో అన్నారు. ఇప్పుడు ముద్రగడ, హర్షకుమార్, చింతామోహన్ కలవడంతో కొత్త రాజకీయ సమీకరణలు  కనిపిస్తున్నాయి.
   
వీరు ముందుంటూ కాంగ్రెస్ నేతలను సమీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ముద్రగడ సొంతూర్లో అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు మాజీ మంత్రి శైలజానాధ్‌, మాజీ ఎంఎల్‌ఎలు పాముల రాజేశ్వరీదేవి, పెండెం దొరబాబు, కొప్పుల రాజు తదితరులు కూడా హాజరు కావడంతో దీన్ని సాదాసీదా విగ్రహావిష్కరణగా రాజకీయ నేతలు భావించడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English