హమ్మయ్య! పయ్యావులకు పదవి దొరికింది

హమ్మయ్య! పయ్యావులకు పదవి దొరికింది

కొందరు నేతలది చిత్రమైన జాతకం. పార్టీ అధికారంలో లేనప్పుడు, దిగ్గజాలు కూడా దారుణంగా ఓడిపోయినప్పుడు తాము గెలుస్తారు. పార్టీ గాలి వీచి అధికారంలోకి వచ్చినప్పుడు తాము ఓడిపోతారు. ప్రతిపక్షంలో ఉండి నోరు నొప్పి పుట్టేలా అరవడమే తప్ప అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించే యోగం ఉండదు. అలాంటి నాయకుల లిస్టులో పయ్యావుల కేశవ్ కూడా ఒకరు.

టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉండి అసెంబ్లీలో పార్టీ స్వరాన్ని బలంగా వినిపించిన నేతల్లో ఆయన ఒకరు. కానీ... టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన అసెంబ్లీలో లేరు. దాంతో మంత్రివర్గంలో తప్పకుండా ఉంటారనుకున్న ఆయన ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. అయినా, పట్టువిడవకుండా ప్రయత్నం చేయడంతో చంద్రబాబు పుణ్యమా అని ఎమ్మెల్సీ అయ్యారు. కానీ.. అప్పటికే ఆలస్యమై మంత్రివర్గంలో ఎమ్మెల్సీల సంఖ్య ఎక్కువైపోయి పయ్యావులకు మంత్రి పదవి రాలేదు. అయితే... గుడ్డిలో మెల్లలా ఇప్పుడాయనకు శాసనమండలిలో చీఫ్ విప్ పదవి ఇచ్చారు చంద్రబాబు. మొత్తానికి తమ నాయకుడికి ఏదో ఒక పదవి దొరికిందిలే అని ఆయన అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారట.
   
నిజానికి ఈ పదవి కూడా పయ్యావులతో దోబూచులాడింది. తెదేపా రాష్ట్ర కార్యాలయ బాధ్యుడు, కృష్ణా జిల్లా నందిగామ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్సీ టీడీ జనార్దన్‌, ఇదే జిల్లాకు చెందిన యలమంచిలి బాబురాజేంద్రప్రసాద్‌, కడప జిల్లాకు చెందిన మాజీమంత్రి రామసుబ్బారెడ్డి పోటీ ఈ పదవికి పోటీ పడ్డారు. జనార్దన్‌ను చీఫ్‌విప్‌ పదవిలో నియమిస్తానని ఇదివరకే చంద్రబాబు హామీ ఇచ్చారన్న ప్రచారం పార్టీలో ఉండేది. తెలుగు రాష్ట్రాల పార్టీ కార్యాలయాల నిర్వహణ బాధ్యతను జనార్దన్‌ తన భుజస్కందాలపై వేసుకుని నిర్వహించడం.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయనకే ఇస్తారనుకున్నారు.
   
మరోవైపు కడప జిల్లాకు చెందిన మాజీమంత్రి రామసుబ్బారెడ్డి పేరు కూడా బలంగానే వినిపించింది. ఆ జిల్లాకు చెందిన వైకాపా ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డిని మంత్రివర్గంలో తీసుకుని తనకు అన్యాయం చేశారని రామసుబ్బారెడ్డి గతంలోనే తన నిరసన వ్యక్తం చేసిన సంగతి విదితమే. వైకాపాకు గుడ్‌బై చెప్పిన ఆది నారాయణరెడ్డిని పార్టీ అధినేత చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. దీనిపై రామసుబ్బారెడ్డి రుసరుసలాడారు. దీంతో చంద్రబాబు ఆయన్ను ఎమ్మెల్సీ చేశారు. చీఫ్‌విప్‌ పదవికి కూడా ఆయన పోటీ పడ్డారు. మరోవైపు టీడీపీలో నోరున్న నేతగా పేరున్న రాజేంద్రప్రసాద్ కూడా పోటీ పడ్డారు. అయితే... పోటీ తీవ్రంగా ఉన్నా పయ్యావుల మాత్రం పదవి అందుకున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English