రేవంత్‌కు కొత్త‌గా షాకిచ్చిన కేసీఆర్‌

రేవంత్‌కు కొత్త‌గా షాకిచ్చిన కేసీఆర్‌

కొడంగ‌ల్ ఎమ్మెల్యే, టీడీపీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరిన‌ రేవంత్‌రెడ్డికి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రేమ పూర్వ‌క షాకిచ్చారు. ఈ ఇద్ద‌రు నేత‌ల పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి విభేదాలు చేరుకున్న సంగ‌తి తెలిసిందే. ఓటుకు నోటు కేసు తర్వాత కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ నేతలకు, రేవంత్‌కు మధ్య వాతావరణం ఉప్పు నిప్పులా మారింది.

సమయం చిక్కినప్పుడల్లా అటు టీఆర్ఎస్ నేతలు, ఇటు రేవంత్ రెడ్డి ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటారు. రేవంత్ టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన సమయంలోనూ ‘ఇక ఆట మొదలైంది’ అని పరోక్షంగా టీఆర్ఎస్‌,కేసీఆర్‌ను హెచ్చరించారు. కేసీఆర్ సైతం అప్ర‌క‌టితంగా రేవంత్‌పై అలాంటి యుద్ధ‌మే కొన‌సాగిస్తున్నారు.

ఇలా ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామాలు, ప్ర‌చ్ఛ‌న్న యుద్ధాలు సాగుతున్న స‌మ‌యంలో....కేసీఆర్ అనూహ్య‌మైన ట్విస్ట్ ఇచ్చారు. రేవంత్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ పుష్ప గుచ్చాన్ని పంపించారు. ‘దేవుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి.

మీరు ప్రజాసేవలో మరెన్నో ఏళ్లపాటు కొనసాగాలి’ అని కేసీఆర్‌ రేవంత్‌కు పంపిన లేఖలో అభిలషించారు. కేసీఆర్ ఇలా లేఖ పంపడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.  టీడీపీలో ఉన్నప్పుడు గానీ, అందుకు ముందుగానీ రేవంత్‌కు కేసీఆర్‌ ఇలా విషెస్‌ చెప్పిన దాఖలాలు లేవు. అయితే రేవంత్‌ కాంగ్రెస్‌లో చేరిన త‌ర్వాత జ‌రుపుకుంటున్న బ‌ర్త్‌డేకు...కేసీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు పంపించడం ఆసక్తికరంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు