దేశ తొలి ఓట‌ర్ మ‌ళ్లీ ఓటేశారు

దేశ తొలి ఓట‌ర్ మ‌ళ్లీ ఓటేశారు

వంద కోట్ల‌కు పైగా ఉన్న దేశ జ‌నాభాలో ఓట‌ర్లు కోట్లాది మంది ఉన్నారు. మరి..దేశ ఓట‌ర్ల జాబితాలో  మొట్టమొద‌టి ఓటుహ‌క్కు ఉన్న వ్య‌క్తి ఎవ‌రంటే.. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌కు చెందిన శ్యాం శ‌ర‌ణ్ నేగి. మీడియా పుణ్య‌మా అని ఈ పెద్ద‌మ‌నిషి దేశ వ్యాప్తంగా సుప‌రిచితుల‌య్యారు.

ప్ర‌తికూల వాతావ‌ర‌ణంలో కావొచ్చు.. ఆరోగ్యం బాగోలేకున్నా.. పోలింగ్ వేళ‌.. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ క్ర‌మం త‌ప్ప‌కుండా ఓటేస్తున్న వ్య‌క్తిగా ఆయ‌న్ను చెప్పాలి. ప్ర‌స్తుతం 101 ఏళ్ల వ‌య‌సులో  వ‌య‌సులో ఉన్న ఆయ‌న‌.. తాజాగా జ‌రుగుతున్న హిమాచ‌ల్ ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఉత్సాహంగా ఓటేశారు.

ముదిమి వ‌య‌సులోనూ ఆయ‌నే స్వ‌యంగా పోలింగ్ కేంద్రానికి వ‌చ్చి ఓటేయ‌టం ఎంద‌రికో స్ఫూర్తినిచ్చింది. స్వాతంత్య్రం వ‌చ్చిన తొలినాళ్ల‌లో జ‌రిగిన పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఓటుహ‌క్కు వినియోగించుకున్న మొట్ట‌మొద‌టి భార‌తీయుడిగా శ‌ర‌ణ్ నేగికి పేరుంది. 1952 ఫిబ్ర‌వ‌రిలో  దేశ వ్యాప్తంగా పార్ల‌మెంటు ఎన్నిక‌లు జ‌రిగాయి.

అయితే.. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో మంచుకార‌ణంగా ఐదు నెల‌ల ముందే  అంటే.. 1951 అక్టోబ‌రులోనే ఎన్నిక‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మొద‌టి ఓటు ఆయ‌న వేశారు. తాజాగా పోలింగ్ కేంద్రానికి వ‌చ్చిన ఆయ‌న‌కు పోలింగ్ అధికారులు మ‌ర్యాద‌గా స్వాగ‌తం ప‌లికారు. నిత్యం హ‌క్కుల గురించి లెక్చ‌ర్లు ఇస్తూ.. పోలింగ్ టైమ్‌కి ప‌త్తా లేకుండా పోయే ఎంతోమందికి శ్యాం శ‌ర‌ణ్ నేగి స్ఫూర్తిని ఆద‌ర్శంగా తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు