రచ్చ రేపుతున్న కమల్ వ్యాఖ్య‌లు

రచ్చ రేపుతున్న కమల్ వ్యాఖ్య‌లు

దేశంలో హిందూ ఉగ్రవాదం పెరిగిపోతోందంటూ విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ చేసిన వ్యాఖ్య‌లు పెను దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్య‌లు చేసిన క‌మ‌ల్ ను కాల్చి చంపడ‌మే క‌రెక్ట‌ని అఖిల భారతీయ హిందూ మహాసభ ఉపాధ్యక్షుడు అశోక్ శర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ వ్యాఖ్య‌ల‌కు క‌మ‌ల్ కూడా ఘాటుగా స్పందించారు.

దేశంలోని జైళ్ళు ఖాళీగా లేవని, అందుకే త‌న‌ను కాల్చి చంపుతామనో, ఉరి తీయాలనో డిమాండ్ చేస్తున్నారని రిటార్ట్ ఇచ్చారు. ప్ర‌ముఖ త‌మిళ హీరో అరవింద స్వామి క‌మ‌ల్ కు బాస‌ట‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. అయితే, తాజాగా, క‌మ‌ల్ వ్యాఖ్య‌ల‌కు నిర‌స‌న‌గా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని విశాఖప‌ట్నంలో ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి.

కమలహాసన్ వ్యాఖ్య‌ల‌ పై దేశ వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హిందువుల మ‌నోభావాలు దెబ్బ‌తినేలా క‌మ‌ల్ వ్యాఖ్యానించార‌ని  జన జాగరణ సమితి కార్యకర్తలు మండిప‌డ్డారు. ఆ వ్యాఖ్య‌ల‌కు నిర‌స‌న‌గా విశాఖపట్నంలో కమల్ దిష్టిబొమ్మను వారు దగ్ధం చేశారు. జన జాగరణ సమితి కార్యకర్తలు కమల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కమల్ వెంట‌నే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, లేకపోతే రాబోయే రోజుల్లో విపరీత పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English