చంద్రబాబుకు చీకాకు తెప్పిస్తున్న ఏపీ బీజేపీ

చంద్రబాబుకు చీకాకు తెప్పిస్తున్న ఏపీ బీజేపీ

ఏపీ సీఎం చంద్రబాబుపై నిత్యం విరుచుకుపడే ఏపీ బీజేపీలోని ఒక వర్గం కొద్దికాలంగా సైలెంటుగా ఉంది. ముఖ్యంగా వెంకయ్యనాయుడు ఉప రాష్ర్టపతిగా వెళ్లిన తరువాత వారంతా చంద్రబాబుపై చీటికిమాటికీ ఫైరవడం మానేశారు. అలా అని వారంతా ఏమీ సైలెంటయినట్లు కాదని తాజా పరిణామాలు చెప్తున్నాయి. చంద్రబాబుపై నిత్యం ఫైరయ్యే వర్గంతో పాటు చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకించే ఆయన బంధువర్గానికి చెందిన బీజేపీ నేతలు కూడా భారీ ప్రణాళికలతో బీజేపీని బలోపేతం చేసే పనిలో పడ్డారట.

 కొద్దిరోజులుగా కామ్‌గా సాగుతున్న ఈ పని తాజాగా పురందేశ్వరి చిత్తూరు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే సీకే బాబుతో భేటీ కావడంతో ఒక్కసారిగా హైలైట్ అయింది. ఏపీలోని వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నేతలను చేర్చుకునేందుకు బీజేపీ స్పెషల్ డ్రైవ్ పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదే జరిగితే మిత్రపక్షం టీడీపీకి చికాకులు తప్పవని తెలుస్తోంది.

చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు నివాసానికి కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి వెళ్లారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ సీకే బాబుతో తమకు ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉందని... తమ భేటీ వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదని ఆమె చెప్తున్నప్పటికీ అది ముమ్మాటికీ రాజకీయ భేటీయేనని టీడీపీ నేతలు అంటున్నారు. సీకే బాబును బీజేపీలోకి ఆహ్వానించే ప్రయత్నాలు జరుగుతున్నాయని... ఈ నేపథ్యంలోనే, ఆయనతో పురందేశ్వరి భేటీ అయ్యారని కొందరు చెబుతున్నారు.

ఏపీలో బీజేపీని బలోపేతం చేసే క్రమంలో, పలువురు నేతలను బీజేపీలోకి తీసుకునే ప్రయత్నంలో రాష్ట్ర బీజేపీ నేతలు ఉన్నారు.  ఇంతకాలం కేంద్రంలో మంత్రిగా ఉంటూ ఏపీ బీజేపీలో పెద్ద నేతగా ఉన్న వెంకయ్యనాయుడు చంద్రబాబుకు మద్దతుగా ఉంటూ ఉండేవారు. ఆ కారణంగా ఏపీ బీజేపీ నేతలు స్వయంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండేది కాదు. ఏపీ బీజేపీ ఏ నిర్ణయమైనా తీసుకున్నా అది చంద్రబాబుకు నచ్చకపోతే అది ఆగిపోయేది. అయితే, ఇప్పుడు చంద్రబాబుకు బీజేపీలో అండదండగా ఉన్న వెంకయ్య ప్రత్యక్ష రాజకీయాలకు దూరమవడంతో ఏపీ బీజేపీ నేతలు పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారు. ఇందుకు గాను అన్ని జిల్లాల్లో కొందరు సీనియర్ నేతలను గుర్తించి వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. మరి చంద్రబాబుకు ఈ పనులు ఎంతవరకు రుచిస్తాయో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు