రేపే కాంగ్రెస్‌లోకి రేవంత్‌!... ఢిల్లీ వేదిక‌గా గ్రాండ్ వెల్‌క‌మ్‌!

రేపే కాంగ్రెస్‌లోకి రేవంత్‌!... ఢిల్లీ వేదిక‌గా గ్రాండ్ వెల్‌క‌మ్‌!

టీడీపీకి, ఆ పార్టీ గుర్తుతో ల‌భించిన శాస‌న‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేసేసిన కొడంగ‌ల్ ఎమ్మెల్యే... ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు క‌లిగిన యువ నేత‌గా రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్న రేవంత్ రెడ్డి రేపు అధికారికంగా గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌లోకి చేరిపోతున్నారు. ఈ మేర‌కు కాసేప‌టి క్రితం హైద‌రాబాదులో జ‌రిగిన *ఆత్మీయులతో మాట-ముచ్చట* స‌భా వేదిక‌గా రేవంత్ రెడ్డి పార్టీ మార్పుపై స్ప‌ష్ట‌త వ‌చ్చేసింది. రేపు ఢిల్లీ వెళ్ల‌నున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ స‌మ‌క్షంలోనే ఆ పార్టీలో చేరిపోతున్నారు. ఇప్ప‌టికే ఓ ద‌ఫా ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి... రాహుల్ గాంధీతో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ఈ విష‌యంపై రెండు వ‌ర్గాల నుంచి కూడా అధికారిక స‌మాచారం లేకున్నా... ఈ విష‌యాన్ని ఖండించడంలో మాత్రం ఆ రెండు వ‌ర్గాలు మౌనాన్నే పాటించాయి. అంటే ఆ భేటీ నిజ‌మేన‌ని ఆ సైలెన్స్ తేల్చి చెప్పేసింద‌న్న మాట‌.

ఆ భేటీతో తెలుగు రాష్ట్ర రాజ‌కీయాల్లో పెను క‌ల‌క‌లం రేగ‌గా... తెలంగాణ‌లో తెలుగు దేశం పార్టీ ఉనికే ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. టీడీపీని వీడిన రేవంత్ రెడ్డి... త‌న వెంట మ‌రింత మంది టీడీపీ నేత‌ల‌ను కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకెళ్లే అవ‌కాశం ఉంద‌ని, ఈ జాబితాలో ఓ ప‌ది మందో, 20 మందితోనే స‌రిపెట్టేది కాద‌ని, జాబితా చాంతాడంత ఉంద‌ని పుకార్లు షికారు చేశాయి. అయితే ఈ వార్త‌ల‌పై ఇటు రేవంత్‌తో పాటు అటు కాంగ్రెస్ పార్టీ కూడా నోరు విప్ప‌డానికి ఇష్ట‌ప‌డ‌టం లేదు. ఇప్ప‌టివ‌ర‌కైతే... టీటీడీపీలో కీల‌క నేత‌గా ఉన్న ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే వేం న‌రేంద‌ర్ రెడ్డి... తాను రేవంత్ రెడ్డి వెంటేన‌ని బ‌హాటంగానే ప్ర‌క‌టించేశారు. అంటే నేటి రాత్రి ఢిల్లీ బ‌య‌లుదేర‌నున్న రేవంత్ రెడ్డి వెంట వేం న‌రేంద‌ర్ రెడ్డి కూడా విమానం ఎక్కేస్తార‌న్న మాట‌. ఇక వీరిద్దరితో పాటు ఇంకా ఎవ‌రెవ‌రు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కుతార‌న్న‌ది తేలాల్సి ఉంది.

రేవంత్ కొట్టిన ఈ దెబ్బ‌కు ఈ ద‌ఫా టీటీడీపీ పూర్తిగా ఖాళీ అయిపోయినా... ఆశ్య‌ర్య‌పోవాల్సిన ప‌నిలేద‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఇదిలా ఉంటే... అప్ప‌టిదాకా తాము కొన‌సాగిన పార్టీల‌కు గుడ్ బై కొట్టేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేత‌ల‌కు రాహుల్ గాంధీ స్వ‌యంగా స్వాగ‌తం ప‌లికిన సంద‌ర్భాలు దాదాపుగా లేవ‌నే చెప్పాలి. అలా పార్టీలు మారిన నేత‌లు వారి రాష్ట్రాల‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ కీల‌క నేత‌ల స‌మ‌క్షంలోనే పార్టీలో చేరారు. అయితే అందుకు భిన్నంగా రేవంత్ రెడ్డికి మాత్రం స్వ‌యంగా రాహుల్ గాంధే స్వ‌యంగా స్వాగ‌తం ప‌లుకుతుండ‌టం గ‌మ‌నార్హం. అంటే... గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ గ్రాండ్‌గానే వెల్ క‌మ్ ప‌లుకుతోంద‌న్న మాట‌. మ‌రి ఇంత‌గా గ్రాండ్ వెల్ క‌మ్ ల‌భిస్తున్న రేవంత్ రెడ్డి... భ‌విష్య‌త్తులో తెలంగాణ‌లో కాంగ్రెస్‌కు తురుపు ముక్క కిందే లెక్క అన్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు