ఇది చాలు..బాబు కంటే రేవంత్‌కు ప‌ట్టు ఎక్కువ‌నేందుకు!

ఇది చాలు..బాబు కంటే రేవంత్‌కు ప‌ట్టు ఎక్కువ‌నేందుకు!

కొడంగ‌ల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కల‌క‌లం టీడీపీలో ఇంకా స‌ద్దుమ‌ణ‌గ‌డం లేదు. టీడీపీకి రేవంత్ రెడ్డి గుడ్‌బై చెప్ప‌డంతో ఆయ‌న‌తో పాటుగా మ‌రికొంద‌రు సైతం పార్టీ మారుతార‌ని వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ అంచ‌నాల‌ను నిజం చేస్తూ పార్టీ అధినేత చంద్ర‌బాబు కంటే...రేవంత్ ప‌ట్ల‌నే త‌మ విశ్వాసాన్ని చాటుకుంటూ ముందుకు సాగుతున్నారు. రేవంత్ ప్ర‌ధాన అనుచ‌రుడ‌నే పేరున్న మాజీ ఎమ్మెల్యే వేం న‌రేంద‌ర్ రెడ్డి ఇప్ప‌టికే రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. ``తెలంగాణలో మీ నాయకత్వం లేకపోవడం నాలాంటి వారికి మనోవేధన కలిగించింది. తెలంగాణ సమాజం ఆలోచనలకు అనుగుణంగా నా ప్రయాణాన్ని కొనసాగించాలనుకుంటున్నాను. అందుకే పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను``అని రాజీనామా లేఖ‌లో వేం నరేందర్ రెడ్డి తెలిపారు. తద్వారా బాబు కంటే..తెలంగాణ‌లో రేవంత్‌కే ఎక్కువ ప‌ట్టుంద‌ని ప‌రోక్షంగా ప్ర‌స్తావించారు.

దీనికి కొన‌సాగింపుగా తెలంగాణలో టీడీపీ సీనియర్ నేత, ఆర్మూరు నియోజకవర్గ ఇంచార్జి రాజారామ్ యాదవ్ ఆ పార్టీకి ఇవాళ గుడ్ బై చెప్పారు. తెలంగాణ ఉద్య‌మంలో ఉస్మానియా యూనివ‌ర్సిటీ విద్యార్థిగా రాజారామ్ యాదవ్ కీల‌కంగా వ్యవహరించారు. ఆ తరువాత మారిన రాజకీయ సమీకరణాల్లో భాగంగా రాజారామ్ యాదవ్ టీడీపీలో చేరి నిజామాబాద్ జిల్లా ఆర్ముర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప తెరాస అభ్యర్థి జీవనరెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తరువాత టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో కలిసి ఎన్నో ప్రభుత్వ వ్యతిరేక  పోరాటాల్లో పాల్గొన్న అయన తాజాగా రేవంత్ రెడ్డి  టీడీపీకి రాజీనామా చెయ్యడంతో.. రాజారామ్ యాదవ్ కూడా గుడ్ బై చెప్పేశారు.

మ‌రోవైపు టీడీపీ అధికార ప్ర‌తినిధిగా ఉన్న దేవ‌ని స‌తీశ్ మాదిగ కూడా రాజీనామా చేశారు. రేవంత్ రెడ్డిని పార్టీలో చాలా అవ‌మానాల‌కు గురిచేశార‌ని, ఆయ‌న పోరాటాల‌ను గౌర‌వించ‌కుండా అవ‌మానించినందుకు నిర‌సన‌గా తాను పార్టీకి గుడ్ బై చెప్తున్న‌ట్లు లేఖ రాశారు. రేవంత్ వెంట సాగ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కాగా, సోమ‌వారం జ‌ర‌గ‌నున్న స‌మావేశంలో రేవంత్ త‌న వెంట న‌డిచే నాయ‌కుల విష‌యంలో స్ప‌ష్ట‌త‌కు రానున్న‌ట్లు స‌మాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు