రేవంత్ ను ఆపాలని బాబును అమిత్‌షా అడిగారా!

రేవంత్ ను ఆపాలని బాబును అమిత్‌షా అడిగారా!

తెలంగాణ టీడీపీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్ష ప‌ద‌వి స‌హా ఆ పార్టీ ద్వారా సంక్ర‌మించిన ప‌దవుల‌న్నింటికీ రాజీనామా చేసిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఎపిసోడ్ మ‌లుపులు తిరుగుతోంది. రేవంత్ రాజీనామా సంద‌ర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాను ప్రస్తావించడంపై కమళనాథులు భగ్గుమంటున్నారని స‌మాచారం. రేవంత్ రెడ్డి రాజీనామాను ఆపాలని, ఆయ‌న కాంగ్రెస్‌లోకి చేరటాన్ని నిలువ‌రించాల‌ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా టీడీపీ రథ‌సార‌థి చంద్రబాబుతో మాట్లాడారని మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. అయితే దీనిపై టీడీపీ ఎలాంటి వివరణ ఇవ్వలేదు.

ఈ ప‌రిణామంపై క‌మ‌ళ‌నాథులు అస‌హ‌నం వ్య‌క్తం చేసిన‌ట్లు సమాచారం. ఈ వార్త మీడియాలో ప్ర‌చారం జ‌ర‌గ‌డంతో రాష్ట్ర కార్య‌వర్గ స‌మావేశాల్లో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ స్వయంగా జోక్యం చేసుకొని...తమ నాయకుడు చంద్రబాబుతో చర్చించలేదని మీడియాకు స్పష్టత ఇచ్చారు. అనేక సందర్భాల్లో అవసరం లేనప్పటికీ...మీడియా వార్తలపై వివరణ ఇచ్చే టీడీపీ పెద్దలు తమ జాతీయ నాయకత్వాన్ని ఇరకాటంలో పడేసే ఉదంతంపై ఎందుకు స్పందించ లేదని ఆయ‌న ప్రశ్నించారు. మిత్రపక్షం బద్‌నాం అయిపోతున్నప్పటికీ...స్పందించకపోవడం ఆ పార్టీ తీరుకు అద్దం పడుతుందని అసహనం వ్యక్తం చేశారు.

కాగా, గతంలోనే బీజేపీలో చేరాలని రేవంత్‌ రెడ్డి భావించగా... ఎమ్మెల్యేల కొనుగోలుకు పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయిన ఓటుకునోటు కేసు నుంచి బయటపడాలని బీజేపీ అధిష్టానం సూచించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ కేసు ఇప్ప‌ట్లో తేలే చాన్స్ లేద‌ని రేవంత్ బీజేపీ వైపు ప‌య‌నం విర‌మించుకున్నార‌ని స‌మాచారం. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా ఈ మేర‌కు బ్రేకులు వేసిన‌ట్లు ప్ర‌చారం సాగింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు