రేవంత్ దెబ్బ‌కు బీజేపీలో చీలిక వ‌చ్చిందా?

రేవంత్ దెబ్బ‌కు బీజేపీలో చీలిక వ‌చ్చిందా?

- 2014 ఎన్నిక‌ల్లో బీజేపీ-టీడీపీ క‌లిసిపోటీ చేశాయి. కానీ ప్ర‌స్తుతం మారిన ప‌రిణామాల నేప‌థ్యంలో మా రెండు పార్టీల మ‌ధ్య బంధాలు తెగిపోయాయి. రాబోయే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేయబోం. మా సొంత ఎజెండా ప్ర‌కారం పార్టీని బ‌లోపేతం చేసేందుకు ముందుకు సాగుతాం.
-- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్

- మిత్రపక్షమైన బీజేపీతో బంధం తెగిపోలేదు. బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు జి.కిషన్‌రెడ్డి నాతో మాట్లాడుతూనే ఉన్నారు. రాబోయే శాసనసభ సమావేశాల్లో ప్రజా సమస్యలపై కలిసే ప్రభుత్వాన్ని నిలదీస్తాం.
...తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.ర‌మ‌ణ‌

తెలుగుదేశం, బీజేపీల స‌ఖ్య‌త‌పై ప్ర‌స్తుత ప‌రిస్థితి ఇది! ఇంత‌కీ ల‌క్ష్మ‌ణ్ ఏ సంద‌ర్భంలో ఈ కామెంట్ చేశారు..ఎల్‌.ర‌మ‌ణ ఎందుకు ఈ క్లారిటీ ఇచ్చారు అంటే...తెలంగాణ టీడీపీ కార్య‌నిర్వాహక అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి వ‌ల్ల‌. 2019 ఎన్నిక‌ల్లో బీజేపీతో క‌లిసి సాగ‌డం కంటే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవ‌డం మేల‌ని కార్య‌నిర్వాహ‌క అధ్యక్షుడి హోదాలో రేవంత్ చేసిన ప్ర‌క‌ట‌న‌పై బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ ఘాటుగా స్పందిస్తూ పొత్తు ముగిసిన అధ్యాయ‌మ‌ని తేల్చేశారు.

అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ చేసిన ప్రకటన గురించి విలేక‌రుల స‌మావేశంలో ఎల్‌.ర‌మ‌ణ వ‌ద్ద‌ విలేక‌రులు ప్రస్తావించగా, అటువంటిదేమీ లేదన్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేత జి. కిషన్‌రెడ్డి తనతో మాట్లాడుతూనే ఉన్నారని, రాబోయే శాసనసభ సమావేశాల్లో ప్రజా సమస్యలపై కలిసే ప్రభుత్వాన్ని నిలదీస్తామని వివ‌ర‌ణ ఇచ్చారు. బీజేపీతో బంధం ఈనాటిది కాదని, ఏనాటిదోనని నాడు ఎన్టీఆర్ హయాంలో కూడా కలిసి పోటీ చేశామని ఆయన గుర్తు చేశారు. ఒకవేళ బీజేపీ త‌మ‌కు దూర‌మైతే తామూ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకూ సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.

ఈ ప‌రిణామాన్ని గ‌మ‌నించిన వారు...త‌మ‌దారి తాము చూసుకొని పార్టీని బ‌లోపేతం చేసేందుకు బీజేపీ అధ్య‌క్షుడు కృషిచేస్తుంటే...సైకిల్ పార్టీతో పొత్తుకోసం తాజామాజీ అధ్య‌క్షుడు, ఎల్పీనేత కిష‌న్ రెడ్డి చేసిన కామెంట్ అర్థ‌మేంటి... స్థూలంగా రేవంత్ కామెంట్ల వ‌ల్ల బీజేపీ నేత‌ల్లో చీలిక వ‌చ్చిందా? అంటూ చ‌ర్చించుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు