ట్రంప్‌ను ఎన్నుకున్నారుగా..అనుభ‌వించండి

ట్రంప్‌ను ఎన్నుకున్నారుగా..అనుభ‌వించండి

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేసేందుకు కాదేదీ అన‌ర్హం అన్న‌ట్లుగా ఉంది ప‌రిస్థితి. నాయ‌కులు ఎవ‌రైనా...దేశం ఏదైనా త‌మ ప్ర‌త్య‌ర్థిని చెండాడే స‌మ‌యంలో దొరికితే చాలు...ఆడుకుంటున్నారు అనిపిస్తోంది తాజాగా ఈ ఉదాహ‌ర‌ణ చూస్తే. ఇటీవల ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాత హార్వే వీన్‌స్టైన్‌ తమను లైంగికంగా వేధించినట్లు ఏంజిలినా జోలీతో పాటు ఎందరో నటీమణులు ఆరోపణలు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ఉదంతం ఆధారంగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై మరోసారి హిల్లరీ క్లింటన్ విమర్శలు గుప్పించారు.

నిర్మాత లైంగిక వేధింపుల గురించి హిల్లరీ క్లింటన్‌ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ హార్వేని ట్రంప్‌తో పోలుస్తూ మాట్లాడారు. అత్యాచారానికి పాల్పడ్డానని ఒప్పుకున్న వ్యక్తినే దేశాధ్యక్షుడిగా ఎన్నుకున్నారని, ప్రపంచవ్యాప్తంగా ఈ లైంగిక వేధింపుల సమస్య ఉందని పేర్కొన్నారు. ``ఇలాంటి ఘటనలపై దృష్టిసారించాల్సిన అవసరం ఎంతో ఉంది. నాకు, నా భర్తకు హార్వే నాలుగేళ్లుగా తెలుసు. అతను నిర్వహించే కార్యక్రమాలకు నేను కూడా వెళుతుండే దాన్ని. కానీ అతనిపై ఇలాంటి లైంగిక వేధింపుల ఆరోపణ లు రావడం నమ్మలేకపోతున్నాను. హార్వే ఏంటి...మహిళలను లైంగికంగా వేధించానని ఒప్పుకున్న వ్యక్తినే(ట్రంప్‌నే) అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. నా ఎన్నికల ప్రచారాల కోసం హార్వే 16వేల డాలర్లు ఖర్చు చేశాడు. వాటిని ఉమెన్స్‌ ఛారిటీకి విరాళంగా ఇస్తాను` అని హిల్లరీ పేర్కొన్నారు .

ఈ సంద‌ర్భంగా ఇరాన్‌, ఉత్తర కొరియా విషయంలో అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌పై హిల్లరీ క్లింటన్‌ దాడికి దిగారు. ఆయన వ్యవహార శైలిని తప్పు పట్టారు. ఇరాన్‌ అణు ఒప్పందం నుంచి బయటకు వస్తామని ట్రంప్‌ చేస్తున్న బెదిరింపులు ప్రమాదకరమైనవని ఆమె పేర్కొన్నారు. అమెరికా ఇతర దేశాలకు ఇచ్చిన హామీల విలువలను ట్రంప్‌ తక్కువచేసి చూపుతున్నారని ఆరోపించారు. ఇరాన్‌ 2015 నాటి అణు ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ట్రంప్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఒప్పందం నుంచి వైదొలగాలన్న ట్రంప్‌ మొండిపట్టు అమెరికా మాటలు సరైనవి కాదన్న సందేశాన్ని ప్రపంచ వ్యాప్తంగా పంపుతున్నాయని విమర్శించారు. అమెరికా ఒప్పందం నుంచి బయటకు వస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించడానికి రెండు రోజులు ముందు హిల్లరీ క్లింటన్‌ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా పలువురు పనిచేసినప్పటికీ, ఈ ప్రత్యేకమైన అధ్యక్షుడు అమెరికా విశ్వాసాన్ని, విశ్వసనీయ స్థానాన్ని తల క్రిందులు చేశారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. అధ్యక్షుడు బరాక్‌ ఒబామా హయాంలో క్లింటన్‌ విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు