వెంక‌న్న భ‌క్తుల‌తో ఆట‌లు.. మొత్తానికే మోసం

వెంక‌న్న భ‌క్తుల‌తో ఆట‌లు.. మొత్తానికే మోసం

అనేక వ్య‌య ప్ర‌యాస‌ల‌కు ఓర్చుకుని తిరుమ‌ల వెళ్లి శ్రీవారిని ద‌ర్శించుకునే భ‌క్తుల‌కు స్వామి వారి సేవా భాగ్యం క‌న్నాముందు లాక‌ర్ సౌక‌ర్యం నుంచి రూం రెంట్‌కి ఇచ్చేవారి వ‌ర‌కు ఇలా ప్ర‌తి చోలా వీరికి చేతులు త‌డ‌పాల్సిన దుస్థితి నెల‌కొంది. ఈ ప‌రిస్థితిపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇక‌, మ‌రో అత్యంత ప్ర‌ధాన ప్రాంతం త‌ల‌నీలాలు స‌మ‌ర్పించే క‌ళ్యాణ క‌ట్ట‌లు. ఇక్క‌డ కూడా భారీ ఎత్తున దోపిడీ పెరిగిపోయింద‌నేది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం వాద‌న‌. ఎక్క‌డెక్క‌డి నుంచో వ‌చ్చే భ‌క్తులు స్వామికి త‌మ త‌ల‌నీలాలు స‌మ‌ర్పించే స‌మ‌యంలో `మీ తృప్తి మేర‌కు` అంటూ సెంటిమెంట్ మంత్రంతో అక్క‌డి క్షుర‌కులు భ‌క్తుల‌ను దోచేస్తున్నారు.

ఈ దోపిడీ రానురాను పెరిగిపోయింది. దీంతో భ‌క్తులు ఇటీవ‌ల కాలంలో టీటీడీ ఉన్న‌తాధికారుల‌కు ఫిర్యాదులు చేశారు. వాస్త‌వానికి టీటీడీ నుంచి ఒక్కో వ్య‌క్తికి త‌ల‌నీలాలు తీసినందుకు స‌ద‌రు క్షుర‌కుల‌కు కాంట్రాక్టు ప్రకారం డబ్బు చెల్లిస్తుంది.  అయినా కూడా  స్వామి దర్శనార్థం వచ్చే భక్తులను క్షుర‌కులు ఏదో ఒక సెంటిమెంట్ రూపంలో బాదేస్తున్నారు.  దీంతో విసుగెత్తిన బాధిత భ‌క్తులు ప‌లుమార్లు టీటీడీ నిర్వ‌హిస్తున్న డ‌య‌ల్ యువ‌ర్ ఈవోలో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించి టీటీడీ.. గ‌తంలో దాదాపు 250 మంది క్షుర‌కుల‌కు నోటీసులు జారీ చేసింది. ఎందుకు డ‌బ్బులు వ‌సూలు చేస్తున్నారో చెప్పాలంటూ నిల‌దీసింది.

అయినా వారిలో మార్పు రాలేదు. దీంతో  243 మంది క్షురకులను విధుల నుంచి తప్పిస్తూ, అధికారులు సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. వీరంతా భక్తులను డిమాండ్ చేసి రూ. 10 నుంచి రూ. 50 వరకూ తీసుకున్నారని, సీసీటీవీ కెమెరాల్లో వీరు డబ్బు తీసుకోవడం రికార్డయిందని అధికారులు తెలిపారు. కాగా, ప్రపంచంలోని అతిపెద్ద కేశ ఖండనశాలగా పేరున్న తిరుమల కల్యాణకట్టలో 943 మంది క్షురకులు 24 గంటల పాటూ షిప్టుల వారీగా పనిచేస్తుంటారు. ఇదిలావుంటే, తొలగించిన క్షురకులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, నాయీ బ్రాహ్మణ సంఘం టీటీడీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు