తెలుగుదేశం లో పవన్ మంటలు

తెలుగుదేశం లో పవన్ మంటలు

అనుకున్న‌దే జ‌రిగింది. అత్యుత్సాహంతో వ్యాఖ్య‌లు చేస్తున్న తెలుగు త‌మ్ముళ్ల‌కు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు క్లాస్ పీకారు. త‌న దారిన తాను పోతూ.. ఆచితూచి వ్యాఖ్య‌లు చేసే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ను ఉద్దేశించి ఈ మ‌ధ్య కాలంలో తెలుగు త‌మ్ముళ్లు చేస్తున్న విమ‌ర్శ‌ల‌పై ఏపీ ముఖ్య‌మంత్రి చుర‌క‌లు వేశారు. తొంద‌ర‌ప‌డి మాట్లాడొద్ద‌న్న సూచ‌న చేసిన బాబు.. మాట‌ల‌తో సానుకూల వాతావ‌ర‌ణాన్ని చెడ‌గొట్ట‌ద‌న్న మాట‌ను వాడేశారు.

త‌న ఆఫీసులో మంత్రులు.. పార్టీ నేత‌ల‌తో క‌లిసి భేటీ అయిన చంద్ర‌బాబు.. ఇటీవ‌ల కాలంలో పార్టీ నేత‌ల మాటల కార‌ణంగా పార్టీకి జ‌రుగుతున్న న‌ష్టాన్ని బాబు ప్ర‌స్తావించారు. ఏపీలో జ‌న‌సేన పార్టీ జెండానే క‌నిపించ‌ట్లేదంటూ ఈ మ‌ధ్య మంత్రి పితాని చేసిన వ్యాఖ్య‌ల‌పై జన‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం రియాక్ట్ అయ్యారు.

ఈ సంద‌ర్భంగా కేంద్ర‌మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి గ‌తంలో తన‌పై చేసిన వ్యాఖ్య‌ల్ని ట్వీట్ రూపంలో ప్ర‌స్తావిస్తూ. . తెలుగుదేశం నేత‌ల తీరుపై వ్యంగ్యాస్త్రం సంధించారు. ఇది జ‌రిగిన రెండు మూడు రోజుల‌కే ఒక బ‌హిరంగ లేఖ ద్వారా పార్టీని విమ‌ర్శిస్తూ చేసే వ్యాఖ్య‌ల్ని ప‌ట్టించుకోవ‌ద్ద‌ని.. స‌హ‌నంగా ఉండాల‌ని ప‌వ‌న్ పిలుపునిచ్చారు.
సుదీర్ఘ‌కాలంగా ఉన్న పార్టీ.. సీనియ‌ర్ నేత‌లు ప్ర‌ద‌ర్శించాల్సిన ప‌రిణితిని ప‌వ‌న్ ప్ర‌ద‌ర్శిస్తే.. ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు చేసిన  టీడీపీ నేత‌ల తీరును ప‌లువురు త‌ప్పు ప‌ట్ట‌టం క‌నిపించింది.

పార్టీ నేత‌లు చేస్తున్న వ్యాఖ్య‌ల‌తో తాను అధికారంలోకి వ‌చ్చేందుకు సాయం చేసిన ప‌వ‌న్ మ‌న‌సును గాయ‌ప‌రుస్తున్న విష‌యాన్ని బాబు ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న‌ట్లుగా క‌నిపిస్తుంది. రాబోయే రోజుల్లో అవ‌స‌రం ఏర్ప‌డితే.. సాయం కోరాల్సిన మిత్రుడ్ని పోగొట్టుకునే క‌న్నా.. పార్టీ నేత‌ల్ని కంట్రోల్ చేయ‌టానికే బాబు మొగ్గు చూపార‌ని చెప్పాలి. దీనికి నిద‌ర్శ‌నంగా బాబు తాజా మాట‌లు ఉన్నాయ‌ని చెబుతున్నారు.

రాష్ట్రంలో పార్టీకి సానుకూల వాతావ‌ర‌ణం ఉంద‌ని.. అత్యుత్సాహంతో అలాంటి వాటిని చెడగొట్టొద్ద‌ని కోర‌టంతో పాటు.. పితాని.. అశోక్ గ‌జ‌ప‌తి చేసిన వ్యాఖ్య‌లు మీడియాలో రావ‌టాన్ని ఉదాహ‌ర‌ణ‌గా చూపిస్తూ.. అలాంటివ‌న్నీ అన‌వ‌స‌ర‌మైన వ్యాఖ్య‌ల‌ని.. అవ‌స‌రం లేని విష‌యాల్ని ఎందుకు మాట్లాడుతున్నారంటూ ప్ర‌శ్నించారు. ఉత్సాహాన్ని కొద్దిగా త‌గ్గించుకోవాలంటూ హిత‌వు ప‌ల‌క‌టం గ‌మ‌నార్హం. అప్ప‌జెప్పిన ప‌నులు చేయాల‌ని.. పొత్తుల‌పై త్వ‌ర‌ప‌డి మాట్లాడొద్దంటూ త‌మ్ముళ్ల‌కు క్లాస్ పీకిన బాబు తీరు ఇప్పుడు పార్టీలో ప‌లువురి నోటికి ప్లాస్ట‌ర్ వేసిన‌ట్లైంద‌న్న మాట వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు