తమ్ముడి గాలి తీసేశాడు

తమ్ముడి గాలి తీసేశాడు

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతితో తమిళ రాజకీయాల్లో ఏర్పడ్డ శూన్యతను భర్తీ చేయడానికి ఓవైపు రజినీకాంత్.. మరోవైపు కమల్ హాసన్ సన్నాహాల్లో ఉన్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరిలో ముందు రజినీనే కొంచెం ఉత్సాహంగా కనిపించినప్పటికీ.. తర్వాత ఆయన కొంచెం జోరు తగ్గించారు.

కమల్ దూకుడుగా వ్యవహరిస్తూ కొత్త పార్టీ పెట్టేందకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం రజినీ కంటే కమల్ మీదే తమిళ జనాలకు ఎక్కువ గురి ఉందంటే అతిశయోక్తి ఏమీ కాదు. ఎందుకంటే రాజకీయాలకు అవసరమైన దూకుడు కమల్‌ లోనే ఎక్కువ కనిపిస్తోంది మరి. రజినీలో ఆ అగ్రెషన్ కనిపించడం లేదు.

ఐతే కమల్ కు రాజకీయ వాతావరణం కొంచెం అనుకూలంగా కనిపిస్తున్న సమయంలో స్వయంగా ఆయన సోదరుడు చారు హాసనే తన గాలి తీసేశాడు. కమల్ రాజకీయాల్లో విజయవంతం కాలేడని ఆయన తేల్చేశారు. కమల్ మాత్రమే కాదు.. రజినీకాంత్ పరిస్థితి కూడా అంతే అని ఆయన అన్నారు. కమల్ అయినా.. రజినీకాంత్ అయినా పార్టీ పెడితే తమిళనాడులో పది శాతం మాత్రమే ఓట్లు రాబట్టగలరని ఆయన తీర్మానించారు.

తమిళనాట కుల, డబ్బు రాజకీయాలదే ఆధిపత్యం అని.. ఆ తరహా రాజకీయాలు కమల్, రజినీ నడపలేరని చారు హాసన్ అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో మిగతా రాజకీయ పార్టీలు ఆరితేరాయని.. కాబట్టి కమల్, రజినీ రాజకీయాల్లో విజయవంతం కాగలరని తాను భావించడం లేదని చారు హాసన్ చెప్పారు. మరి సోదరుడి వ్యాఖ్యలపై కమల్ ఎలా స్పందిస్తారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు