రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ ఇదే

రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ ఇదే

సీఎం కేసీఆర్‌.. తెలంగాణ ఉద్య‌మ‌నేత కోదండం మాష్టార్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్య‌లే చేశారు. కేసీఆర్ ఉప‌యోగించిన కొన్ని ప‌దాలు అయితే.. కోదండం మాష్టారు జ‌న్మ‌లో మ‌ర్చిపోలేరేమో. త‌న‌ను తీవ్రంగా అవ‌మానించేలా.. త‌న క్యారెక్ట‌ర్‌ను బ‌ద్నాం చేసేలా ఉన్న కేసీఆర్ వ్యాఖ్య‌ల్ని కోదండం మాత్ర‌మే కాదు ఆయ‌న్ను అభిమానించే వారు సైతం జీర్ణించుకోలేక‌పోయిన ప‌రిస్థితి.

ఆ మాట‌కు వ‌స్తే.. కోదండాన్ని తీవ్రంగా వ్య‌తిరేకించే సీమాంధ్రుల‌కు సైతం కేసీఆర్ వ్యాఖ్య‌లు షాకింగ్ గా మారాయ‌న్న మాట వినిపిస్తోంది. అంత పెద్ద ఉద్య‌మం జ‌రిగి.. తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్య‌తిరేకించిన సీమాంధ్రులు సైతం కోదండం మాష్టారిపై అంత‌లా నోరు పారేసుకోలేద‌ని.. అందుకు భిన్నంగా కేసీఆర్ వ్యాఖ్య‌లు ఉన్నాయ‌న్న మాట ప‌లువురి నోటి నుంచి వినిపిస్తోంది.

ఏ ఉద్య‌మం కోసం త‌న‌ను తాను ప‌ణంగా పెట్టుకున్నారో.. ఇప్పుడ‌దే గ‌డ్డను ఏలుతున్న అధినేత కోదండం మాష్టార్ని చుల‌క‌న చేసేలా.. చిన్న‌బుచ్చేలా.. అవ‌మానించేలా మాట్లాడ‌టంపై తెలంగాణ రాష్ట్రంలోనే కాదు.. సీమాంధ్ర‌లోనూ భారీ చ‌ర్చ జ‌రుగుతుండ‌టం గ‌మ‌నార్హం. కేసీఆర్ ఎందుకిలా మాట్లాడారు?  కోదండం మాష్టార్ని అన్నేసి మాట‌లు అన‌టం పార్టీకి జ‌రిగే న‌ష్టం ఎంత‌న్న దానిపైనా సీమాంధ్రలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇక‌.. తెలంగాణ స‌మాజంలోనూ కేసీఆర్ తిట్ల మీద పెద్ద ఎత్తున చ‌ర్చ మొద‌లైంది. మేధావులు.. క‌ళాకారులు.. తెలంగాణ ఉద్య‌మంలో చురుగ్గా పాల్గొన్న వారిలో కేసీఆర్ మాట తీరు.. కోదండంపై ఫైర్ అయిన వైఖ‌రిపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. గ‌తంలో జేఏసీలు పెట్టి ఉద్య‌మాలు చేసిన వారంతా తాజా తిట్ల పురాణంపై అసంతృప్తి వ్య‌క్తం చేయ‌టం క‌నిపిస్తోంది. ఇలాంటివి కొత్త‌గా ఏర్ప‌డిన రాష్ట్రానికి ఏ మాత్రం మంచిది కాద‌ని.. రాజ‌కీయంగా పెద్ద విభేదాలు లేకుండా ఉన్న‌ప్ప‌టికీ.. తాను త‌ప్ప మ‌రెవ‌రూ ఉండ‌కూడ‌ద‌న్నట్లుగా కేసీఆర్ మైండ్ సెట్ ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఏమైనా.. కేసీఆర్ తిట్టి రెండు రోజులు గ‌డుస్తున్నా.. దానికి సంబంధించిన చ‌ర్చ మాత్రం ఇంకా ప‌చ్చిగానే ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు