కేసీఆర్‌కు కోదండం మాష్టారి ఘాటు కౌంట‌ర్‌

కేసీఆర్‌కు కోదండం మాష్టారి ఘాటు కౌంట‌ర్‌

తీవ్ర ఉద్రిక్త‌త‌ల మ‌ధ్య తెలంగాణ ఉద్య‌మం పీక్ స్టేజ్ లో సాగుతున్న వేళ‌.. తెలంగాణ ఉద్య‌మాన్ని.. తెలంగాణ ఏర్పాటు అంశాన్ని తీవ్రంగా వ్య‌తిరేకించినోళ్లు సైతం నోరు పారేసుకోనంత తీవ్ర స్థాయిలో తెలంగాణ జేఏసీ పొలిటిక‌ల్ జేఏసీ ఛైర్మ‌న్ కోదండం మాష్టారిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ విరుచుకుప‌డ‌టం తెలిసిందే. మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి.. ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌టమే కాదు.. వ్య‌క్తిగ‌తంగా చిన్న‌బుచ్చేలా.. చురుకుపుట్టేలా కోదండం మాష్టారిపై మండిప‌డ్డారు కేసీఆర్‌.

తెలంగాణ వ్య‌తిరేకి అని.. తాడు బొంగ‌రం లేనోడు.. వాడు.. వీడు అంటూ కేసీఆర్ నోటికి ఎలాంటి మాట‌లు వ‌స్తున్నాయో తెలీని రీతిలో ఫైర్ అయిన దానిపై కోదండం మాష్టారి రియాక్ట్ అయ్యారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై కోదండం మాష్టారు తీవ్రంగా స్పందిస్తూ.. చ‌ర్చ‌ను వ్య‌క్తిగ‌తం చేసి.. స‌మాధానాలు దాట వేసిన సీఎం హింస‌ను ప్రేరేపించేలా మాట్లాడార‌న్నారు.

శ‌నివారం జేఏసీ స‌మావేశాన్ని ఏర్పాటు చేసిన కోదండం మాష్టారు.. మీటింగ్ ముగిసిన త‌ర్వాత మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగం నుంచి నిర్వాసితుల వ‌ర‌కూ తాము లేవ‌నెత్తుతున్న స‌మ‌స్య‌ల‌పై సీఎం క‌నీసం సమాధానం చెప్ప‌లేద‌న్నారు. చ‌ర్చ‌ను వ్య‌క్తిగ‌తం చేసి దాట‌వేత ధోర‌ణిని ప్ర‌ద‌ర్శిస్తున్నార‌న్నారు. హింసను ప్రేరేపించేలా మాట్లాడుతున్నార‌న్న కోదండ‌రామ్‌.. కేసీఆర్ తీరు గ‌డిచిన రెండు ప్రెస్ మీట్ ల‌లోనూ రుజువైంద‌న్నారు.

ఏ ఒక్క‌రో పోరాడితేనో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాలేద‌ని.. కోట్లాది మంది ప్ర‌జ‌లు.. వేల కొద్దీ సంస్థ‌లు క‌లిసి క‌ట్టుగా పోరాడితేనే తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డింద‌న్నారు. ఈ రోజు తాను చేస్తున్న పోరాటం సామాజిక తెలంగాణ కోస‌మే త‌ప్పించి మ‌రో దాని కోసం కాద‌ని.. ఆ విష‌యాన్ని ప్ర‌జ‌లంతా గుర్తించాల‌న్నారు.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఉద్య‌మాన్ని త‌క్కువ చేసి మాట్లాడ‌టం త‌గ‌ద‌న్నారు. ఏ ఒక్క‌రి వ‌ల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. ‘‘ 1952 లోనే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలైంది. 1969లో వందల మంది అమరులయ్యారు. 1989లో ప్రభాకర్‌లాంటి కొందరి చొరవతో  మళ్లీ చర్చ మొదలైంది. 1996లో జయశంకర్‌ సార్, కేశవరావ్‌ జాదవ్‌, భూపతి కృష్ణమూర్తి లాంటి అలోచనాపరుల సైద్ధాంతికతో ఉద్యమం విస్ఫోటనంగా మారింది" అని చెప్పారు. గ‌డిచిన ద‌శాబ్దంలో జ‌రిగిన ఉద్య‌మంలో అనేక సంస్థ‌లు.. వ్య‌క్తులు భాగ‌స్వామ‌య్య‌మ‌య్యార‌ని.. పోరాడి సాధించుకున్న‌రాష్ట్రంలో సామాజిక న్యాయం కావాల‌ని అడిగితే చ‌ర్చ‌ను ప‌క్క‌దారి ప‌ట్టిస్తున్నార‌న్నారు. ఇప్పుడు జ‌రుగుతున్న పోరాటం మొత్తం సామాజిక అవ‌సరాల దృష్టిలోనే చూడాల‌న్నారు. కేసీఆర్ తో పోలిస్తే.. కోదండం మాష్టారు తీవ్ర ప‌ద‌జాలంతో విరుచుకుప‌డ‌కున్నా.. త‌న‌ను త‌ప్పు ప‌ట్టిన ముఖ్య‌మంత్రి మాట‌లు స‌రికావ‌న్న మాట‌ను చెప్పే ప్ర‌య‌త్నం చేశార‌ని చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English