పాక్‌కు మ‌ళ్లీ గ‌ట్టి వార్నింగ్ ఇచ్చిన ట్రంప్‌

పాక్‌కు మ‌ళ్లీ గ‌ట్టి వార్నింగ్ ఇచ్చిన ట్రంప్‌

ఉగ్రవాద సంస్థలకు అడ్డగా మారి.... ప్రమాదకర అణ్వాయుధాలు ఉన్న పాకిస్థాన్‌.. టెర్రరిస్టు సంస్థలకు నీడనివ్వడం పట్ల అమెరికా ఆగ్రహంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. పాక్‌కు భారీగా ఆర్థిక సాయం కూడా చేస్తున్న అమెరికా ...ఉగ్ర సంస్థలకు సాయం చేయడం ఆపేయాలని ఇప్పటికే పాక్‌కు వార్నింగ్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ దేశం నుంచి ఉగ్ర కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్ పాకిస్థాన్‌కు మళ్లీ గట్టి వార్నింగ్‌ ఇచ్చారు . అయితే ఈసారి తన సందేశాన్ని మరితం స్పష్టంగా వినిపించేందుకు ఏకంగా తన టీమ్‌నే పాక్‌కు పంపాలని ట్రంప్‌ నిర్ణయించారు.

ఆఫ్ఘన్‌ బోర్డర్‌ దగ్గర ఉగ్రవాదులు భారీ స్థాయిలో హింస సృష్టిస్తున్నారు. తాలిబన్లను పాక్‌ పెంచి పోషిస్తోంది. అయితే ట్రంప్‌ ప్రభుత్వం ఇప్పుడు పాక్‌ విషయంలో సీరియస్‌గా మారింది. ఆ దేశానికి నిధులు ఇవ్వాలా వద్దా అన్న సందేహంలో పడింది. అయితే ఉగ్ర సంస్థలకు ఊతం ఇస్తున్న పాక్‌ను అడ్డుకునేందుకు అమెరికా తన మేటి టీమ్‌ను ఆ దేశానికి పంపించనుంది. మొదటగా అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్‌ టిల్లర్సన్‌ ఈ నెలలో పాక్‌లో పర్యటించనున్నారు. ఆ తర్వాత అమెరికా రక్షణ మంత్రి జేమ్స్‌ మాటిస్‌ కూడా పాక్‌లో టూర్‌ చేస్తారు. ఈ ఇద్దరూ పాక్‌కు ట్రంప్‌ సందేశాన్ని చేరవేయనున్నారు. కచ్చితంగా ఉగ్ర సంస్థలకు సహాయాన్ని నిలిపివేయాలని పాక్‌కు ఆదేశాలు ఇవ్వనున్నారు.

కాగా, రెండ్రోజుల కింద అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్  దక్షిణాసియా, ఆఫ్ఘనిస్థాన్‌లపై ఏర్పాటు చేసిన సాయుధ సేవల సభా కమిటీ ముందు మాట్లాడుతూ పాకిస్థాన్ తన పద్ధతి మార్చుకోకపోతే, ఉగ్రవాద గ్రూపులకు మద్దతును కొనసాగిస్తే ఆ దేశానికి వ్యతిరేకంగా అవసరమైన చర్యలు తీసుకోవడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తమ భూభాగంపైనున్న ఉగ్రవాద స్థావరాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోకపోతే నాటోయేతర మ్రితపక్షం హోదాను కోల్పోవాల్సి వస్తుందని, దౌత్యపరంగా ఏకాకులవుతారు అని హెచ్చరించారు. మన ప్రయత్నాలు విఫలమైతే, అవసరమైన చర్యలు తీసుకోవడానికి అధ్యక్షుడు ట్రంప్ సిద్ధంగా ఉన్నారు అని చెప్పారు. పాకిస్థాన్ తమ హెచ్చరికలను పట్టించుకోకపోతే దానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయని మాటిస్ స్పష్టం చేశారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకాభిప్రాయం వ్యక్తమవుతున్నందున, దౌత్యపరంగా పాకిస్థాన్ ఒంటరిగా మిగిలిపోతుందని, అందువల్ల అటువంటి పరిస్థితి రాకమునుపే ఆ దేశం తన విధానాలను మార్చుకోగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు