నేను తయారు చేసిన కార్యకర్తల్లో కోదండ‌రాం ఒకరు - కేసీఆర్

నేను తయారు చేసిన కార్యకర్తల్లో కోదండ‌రాం ఒకరు - కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఆగ్ర‌హం వ‌చ్చింది! అదికూడా ఉద్య‌మంలో క‌లిసిమెలిసి భుజం భుజం రాసుకుని న‌డిచిన మేధావి, ప్రొఫెస‌ర్ కోదండ‌రాంపై!! ఇంకే ముంది ఉతికి ఆరేశారు కేసీఆర్‌. గ‌తంలో సంగ‌తులు స‌హా తాజా విష‌యాల‌ను కూడా క‌లిపి రేవు పెట్టేశారు. నిజానికి ఉద్య‌మం జ‌రిగిన రోజుల్లోను, త‌ర్వాత కూడా కేసీఆర్‌.. కోదండ రాంపై గౌరవ భావాన్నే ప్ర‌ద‌ర్శించారు. అయితే, కోదండ రాం మాత్రం కేసీఆర్ పాల‌న‌పై వ్యాఖ్య‌ల‌తో మొద‌లు పెట్టి ఉద్య‌మాల‌కు దిగారు. విప‌క్షాలతో క‌లిసి కేసీఆర్‌ను తిట్టిపోస్తున్నారు. తాజాగా జ‌రిగిన సింగ‌రేణి ఎన్నిక‌ల ప్ర‌చారంలో టీఆర్ ఎస్ కార్మిక సంఘానికి వ్య‌తిరేకంగా కూడా కోదండ‌రాం మాట్లాడారు. దీంతో కేసీఆర్‌కు మండిపోయింది. మొద‌ట్లో కోదండ‌రాం ఎందుక‌లా మారారో తెలియ‌క త‌ల‌ప‌ట్టుకున్న కేసీఆర్ ఇక‌, లాభం లేద‌ని ఆయ‌నపై ఎదురు దాడి చేయిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఆయ‌నే ఫైటింగ్‌కు దిగిపోయారు.

కోదండరాం జీవితంలో సర్పంచ్ కాలేదని కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఆయన తనను తాను ఎక్కువగా ఊహించుకున్నారని,  కోదండరాం అనే వాడు టీఆర్ఎస్ వ్యతిరేకి అన్నారు. టీబీజీకేఎస్‌కు ఓటేస్తే ఫలితం ఉండదని అంటారా? అని నిలదీశారు. టీబీజీకేఎస్‌ను ఓడించాలని కోదండ సింగరేణిలో చెప్పడం విడ్డూరమన్నారు. ఆయన ఏమైనా జాతీయ నాయకుడా అని నిలదీశారు. ఎవరైనా సద్విమర్శలు చేస్తే స్వీకరిస్తామని, అక్కసుతో మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు.

``నేను తయారు చేసిన వేలమంది కార్యకర్తల్లో కోదండ ఒకరు. టీఆర్ ఎస్‌ అధికారంలోకి రావడం ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదు. పనికిమాలిన సంఘాలతో ఇప్పుడు జేఏసీ నడుపుతున్నాడు`` అని కేసీఆర్ విరుచుకుప‌డ్డారు. కొలువుల కొట్లాట ఎవరి కోసమని నిలదీశారు. కోదండకు రాజకీయాలపై ఆసక్తి ఉంటే నేరుగా రావాలన్నారు. కావాలంటే టిక్కెట్ ఇస్తానని చెప్పానని కేసీఆర్ అన్నారు. కానీ దానికి జేఏసీ ముసుగు ఎందుకు అని నిలదీశారు. కోదండను ప్రజలు పట్టించుకోవద్దని పిలుపునిచ్చారు.

తెలంగాణ ఉద్యమం సమయంలో అన్ని పార్టీలను ఏకతాటి పైకి తెచ్చేందుకు ఐకాస ఏర్పాటు చేశామని, అన్ని కార్యక్రమాలను టీఆర్ ఎస్‌ ముందుండి నడిపించిందని, జేఏసీకి పేరు పెట్టిందే తానని, కార్యక్రమాలను తాను సూచించానని చెప్పి, తద్వారా ఉద్యమం సమయంలో జేఏసీ క్రెడిట్ అంతా తన ఖాతాలో వేసుకున్నారని కోదండ రాంపై విరుచుకుప‌డ్డారు. పదవులను గడ్డిపోచలా భావించి త్యాగం చేశామని చెప్పారు.  మొత్తానికి ఇలా కోదండ‌రాంపై కేసీఆర్ నేరుగా విరుచుకుప‌డ‌డం ఇదే ఫ‌స్ట్ కావ‌డంతో ఎక్క‌డాలేని ప్రాధాన్యం సంత‌రించుకుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు