39 రోజులు హ‌నీప్రీత్ ఎక్క‌డ ఉన్న‌ట్లు?

39 రోజులు హ‌నీప్రీత్ ఎక్క‌డ ఉన్న‌ట్లు?

డేరా బాబా ద‌త్త‌పుత్రిక‌గా సుప‌రిచితురాలై.. ఆయ‌న‌తో వివాహేత‌ర సంబంధం ఉంద‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోంది హ‌నీప్రీత్‌. ఇద్ద‌రు సాధ్వీల‌ను లైంగికంగా వేధింపుల‌కు గురి చేసిన కేసులో 20 ఏళ్ల జైలుశిక్ష అనుభ‌విస్తున్న  డేరాబాబాను త‌ప్పించేందుకు హ‌నీ  ప్ర‌య‌త్నించింద‌న్న‌ది ఆమెపై ఉన్న ఆరోప‌ణ‌. లైంగిక వేధింపుల కేసుపై పంచ‌కుల కోర్టు ఇచ్చిన తీర్పుతో డేరాలు రెచ్చిపోయేలా చేసి.. ప‌లు రాష్ట్రాలు అట్టుడికిపోయేలా చేయ‌టం వెనుక హ‌నీ హ‌స్తం ఉంద‌న్న‌ది ఆరోప‌ణ‌.

ప్రాణ న‌ష్టంతో పాటు.. భారీ ఆస్తి నష్టానికి కార‌ణంగా భావిస్తున్న హ‌నీప్రీత్ ఆచూకీ కోసం హ‌ర్యానా.. పంజాబ్ పోలీసులు తీవ్రంగా గాలింపులు జ‌రిపారు. ఎట్టేక‌ల‌కు 39 రోజుల అనంత‌రం ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్నిరోజులు  క‌నిపించ‌కుండా పోయిన ఆమెను పోలీసులు ఎలా ప‌ట్టుకున్నార‌న్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

తాను ఎంపిక చేసుకున్న టీవీ ఛాన‌ళ్ల‌కు ఇంట‌ర్వ్యూలు ఇచ్చిన త‌ర్వాత‌.. ముంద‌స్తుగా చేసుకున్న ఒప్పందం ప్ర‌కారం పోలీసుల ద‌గ్గ‌ర లొంగిపోయింద‌న్న వాద‌న వినిపిస్తుంటే.. మ‌రోవైపు.. మీడియాలో టెలికాస్ట్ అయిన ఇంట‌ర్వ్యూను చూసి.. ప‌క‌డ్బందీగా ఏర్పాట్లు చేయ‌టంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకోగ‌లిగార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇప్పుడు పోలీసుల ఫోక‌స్ అంతా హ‌నీకి ఆశ్ర‌యం ఇచ్చిన వారెవ‌రు? అన్న‌ది తెలుసుకోవ‌టంపైనే దృష్టి పెట్టార‌ని చెప్పాలి. ఇంత‌కాలం పాటు పోలీసుల‌కు చిక్క‌కుండా... వారి క‌న్నుగ‌ప్పి ఉండ‌టానికి ఆమెకు స‌హ‌కారం అందించింది ఎవ‌ర‌న్న విష‌యం మీద పోలీసులు దృష్టి సారించిన‌ట్లుగా చెబుతున్నారు.ఈ విష‌యం తెలుసుకుంటే.. ఆమె మీద ఉన్న నేరారోప‌ణ‌ల్ని మ‌రింత లోతుగా విచారించ‌టానికి అవ‌కాశం ల‌భిస్తుంద‌న్న మాట వినిపిస్తోంది. మ‌రి.. ఈ విష‌యంపై హ‌నీ నోరు విప్పుతుందా?  లేదా? అన్న‌ది ప్ర‌శ్న‌గా చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు