ఆ ఎంపీకి లైంగిక వేధింపులు ఎదుర‌య్యాయ‌ట‌

ఆ ఎంపీకి లైంగిక వేధింపులు ఎదుర‌య్యాయ‌ట‌

ప‌రిస్థితి మారింది. త‌ప్పు చేసినోళ్లు సిగ్గు ప‌డాల్సింది పోయి.. బాధితులు భ‌య‌ప‌డే రోజులు దాదాపుగా పోయిన‌ట్లే. త‌మ‌కు జ‌రిగిన అన్యాయాన్ని బ‌య‌ట‌కు చెప్పేందుకు మ‌హిళ‌లు ఇప్పుడు వెనుకాడ‌టం లేదు. గ‌తంలో త‌మ‌కు జ‌రిగిన అవ‌మానాల‌ను త‌మ‌లోనే దాచుకొని అదే ప‌నిగా వేద‌న‌కు గుర‌య్యేవారు. ఇప్పుడు అలా కాదు.. ధైర్యంగా బ‌య‌ట‌కు చెప్ప‌ట‌మే కాదు.. అలాంటి ప‌రిస్థితులు మారేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు.

తాము లైంగికంగా వేధింపుల‌కు గురైన‌ట్లు ప్ర‌ముఖులు త‌మ‌కు తాముగా చెప్పుకోవ‌టం చాలా అరుదు. కానీ.. మారిన ప‌రిస్థితుల్లో కొంద‌రు త‌మ‌కు జ‌రిగిన అన్యాయం గురించి గ‌ళం విప్పుతున్నారు. తాజాగా ఆ జాబితాలో చేరారు బీజేపీ మ‌హిళా ఎంపీ పూన‌మ్ మ‌హాజ‌న్‌. 

అహ్మ‌దాబాద్ లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ లో నిర్వ‌హించిన రెడ్ బ్రిక్ స‌ద‌స్సులో ఆమె మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా త‌న గ‌తం గురించి చెప్పుకొచ్చారు. ప్ర‌స్తుతం ముంబ‌యి ఉత్త‌ర నియోజ‌క‌వ‌ర్గం బీజేపీ ఎంపీగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఆమె.. తాను చ‌దువుకునే రోజుల్లో కారులో వెళ్లే స్థోమ‌త ఉండేది కాద‌ని దీంతో వెర్సోవా నుంచి వోర్లి వ‌ర‌కూ రోజూ రైల్లో ప్ర‌యానించేదానిన‌ని చెప్పారు. అప్ప‌ట్లో కొంత‌మంది త‌న ప‌ట్ల అస‌భ్య‌క‌రంగా చూసేవార‌ని.. వారిని తాను ప‌ట్టించుకునేదాన్నికాద‌న్నారు. కొంద‌రు త‌న‌ను తాకేందుకు ప్ర‌య‌త్నించేవార‌ని.. ప్ర‌తి ఒక్క‌రికి ఏదో ఒక స‌మ‌యంలో లైంగిక వేధింపులు త‌ప్ప‌వ‌న్నారు.

దేశంలో మ‌హిళ‌ల్ని దేవ‌తలుగా కొలుస్తార‌ని చెప్పిన పూనం.. కొన్ని విష‌యాల్లో అమెరికాను మించిపోయిన‌ట్లుగా చెప్పారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్క అమెరిక‌న్ మ‌హిళ కూడా ఆ దేశ అధ్యక్షురాలిగా వ్య‌వ‌హ‌రించ‌లేద‌ని.. కానీ.. అది భార‌త్ లో సాధ్య‌మైంద‌న్నారు. ర‌క్ష‌ణ శాఖా మంత్రిగా.. రాష్ట్ర ముఖ్య‌మంత్రులు మ‌హిళ‌లు కీల‌క బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తిస్తున్న‌ట్లు చెప్పారు. త‌మ శ‌క్తిసామ‌ర్థ్యాల్ని ప్ర‌ద‌ర్శించుకునే విష‌యంలో అస్స‌లు వెన‌క్కి త‌గ్గ‌కూడ‌దంటూ పూనం పిలుపునిచ్చారు. ఇంత ధైర్యంగా ఒక ఎంపీ త‌న గురించి బ‌య‌ట‌కు చెప్ప‌టం నిజంగా అభినందించ‌ద‌గ్గ విష‌య‌మే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు