ఈ సారి సీమ‌లో కేసీఆర్ ఎక్క‌డికి వెళ్తున్నారంటే...

ఈ సారి సీమ‌లో కేసీఆర్ ఎక్క‌డికి వెళ్తున్నారంటే...

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రోమారు రాయ‌ల‌సీమ వెళ్ల‌నున్నారు. అందులోనూ అనంత‌పురంలో ప‌ర్య‌టించ‌నున్నారు. తాజాగా ఏపీ మంత్రి ప‌రిటాల సునిత త‌న‌యుడు శ్రీ‌రామ్ వివాహానికి హాజ‌రైన కేసీఆర్‌కు అక్క‌డ విశేష‌మైన ఆద‌ర‌ణ ద‌క్కిన సంగ‌తి తెలిసిందే. ఇంకా చెప్పాలంటే పెళ్లి వేడుకల్లో కేసీఆర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వివాహ‌ వేదిక మీద నుంచి ఆయన విక్టరీ గుర్తు చూప‌గా.... వెంటనే అక్కడున్న వారంతా కేసీఆర్‌కు అభివాదం చేశారు. తిరుగు ప్రయాణంలో హెలీప్యాడ్‌ వద్ద సీఎం కేసీఆర్‌ టీడీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌తో పది నిమిషాల సేపు ఏకాంతం సంభాషణ చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

అయితే ఈ క్రేజ్ కార‌ణంగానే మ‌ళ్లీ సీమ‌కు వెళ్ల‌నున్నారా లేదా ఇత‌ర‌త్రా ఏ కార‌ణంతో మ‌ళ్లీ అదే జిల్లాకు వెళ్లానున్నార‌నే ఆస‌క్తికి మాజీ మంత్రి, సీనియ‌ర్ నేత ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. త్వరలో పుట్టపర్తికి వచ్చి భగవాన్ సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకుంటానని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు త‌న‌కు తెలిపారని స్థానిక ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి వెల్ల‌డించారు. కేసీఆర్ సత్యసాయి విమానాశ్రయం చేరుకోగా ప‌ల్లె ఆయనను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తాను త్వరలోనే మళ్లీ పుట్టపర్తికి వస్తానని, అప్పుడు సత్యసాయి మహాసమాధిని దర్శించుకుంటానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి సైతం విశేష సేవలందించిన బాబా అజరామరుడు అన్నారు. బాబా విద్య, వైద్యం, తాగునీరు వంటి ఎన్నో బృహత్తర కార్యక్రమాలు చేపట్టి ప్రపంచానికే ఆదర్శప్రాయుడయ్యారని కొనియాడారని ప‌ల్లె వివ‌రించారు.

కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్‌ తొలిసారి అనంతపురం జిల్లాలో పర్యటించారు. తన కుమారుడు పెళ్లికి రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మంత్రి సునీత కలిసి ఆహ్వానించారు. దీంతో ఆదివారం కేసీఆర్‌ ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ నుండి పుట్టపర్తి వరకు చేరుకుని, అక్కడ నుండి హెలికాప్టర్‌లో వెంకటాపురంకు చేరుకున్నారు. కేసీఆర్‌ వెంట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు దయాకర్‌రావు, భాస్కర్‌రావు తదితరులు ఉన్నారు. వారికి అక్కడ ఘనస్వాగతం లభించింది. నూతన వధూవరులు శ్రీరామ్‌, జ్ఞానను కేసీఆర్‌ ఆశీర్వదించారు. వారు పాదాభివందనం చేయగా, కేసీఆర్‌ పుష్ఫగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన పరిటాల రవి ఘాట్‌ వద్దకు వెళ్లి నివాళులర్పించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు