కూర్చుని జనగనమణ పాడకూడదా?

కూర్చుని జనగనమణ పాడకూడదా?

సినిమా హాళ్లో జాతీయ గీతాలాప‌న అంశం దేశ‌భ‌క్తి పెంపొందించ‌డం సంగ‌తి ప‌క్క‌న‌పెడితే....వివాదాల్లో న‌ల‌గ‌డంలో ఎక్కువ‌గా తెర‌మీద‌కు వ‌స్తోందని అంటున్నారు. తాజాగా ఓ విక‌లాంగుడు జాతీయ గీతాన్ని గౌర‌వించ‌లేద‌ని వివాదం చోటుచేసుకుంది. పైగా ఆయ‌న పాకిస్తానీ అని నిందించ‌డం క‌ల‌కలానికి దారితీసింది. గువాహటిలో ఈ ఉదంతం జ‌రిగింది. ఒక సినిమా హాల్‌లో జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో వీల్‌ఛైర్‌లో కూర్చుని లేవడానికి సాధ్యం కాని వ్యక్తిని ఇద్దరు ప్రేక్షకులు పాకిస్తానీ అంటూ గేలి చేశారు.

ఆర్మన్‌ అలీ అనే 36 ఏళ్ల వికలాంగుల హక్కుల కార్యకర్త, శిశు సరోథి అనే ఎన్‌జిఒ డైరెక్టర్‌ తన మేనకోడలు, మేనల్లుడితో కలిసి సినిమాకు వెళ్లాడు. సినిమాకు ముందు జాతీయ గీతం ఆలపించే సమయంలో అతడు వీల్‌ ఛైర్‌లో నిటారుగా కూర్చున్నాడు. ఆ సమయంలో వెనుకనుంచి ఇద్దరు ప్రేక్షకులు అతడిని చూపిస్తూ ``సామ్నే ఏక్‌ పాకిస్తానీ భైఠా హై (ముందు వరుసలో ఒక పాకిస్తానీ కూర్చున్నాడు)`` అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై అలీ ఫేస్‌బుక్‌లో తన బాధను వ్యక్తం చేస్తూ ఒక వ్యాఖ్య రాశాడు. వీల్‌ఛైర్‌కు అతుక్కుపోయిన తనను విమర్శించడం ద్వారా వారు తమ జాతీయ విధి నిర్వర్తించామని భావిస్తున్నారేమో అంటూ అలీ పేర్కొన్నాడు. ఈ సినిమా చూడ‌టానికి పాకిస్తానీ నుంచి వ‌స్తున్నారా అంటూ త‌న  మేన‌కోడ‌లు ఆశ్చ‌ర్య‌పోతూ అడిగింద‌ని ఆయ‌న ప్ర‌స్తావించారు.

థియేటర్‌లో సినిమా ప్రారంభానికి ముందు జాతీయ గీతం ప్ర‌ద‌ర్శించాల‌ని, ఆ స‌మ‌యంలో ప్రేక్ష‌కులు నిల్చోవాల‌ని ఇటీవ‌ల సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ప‌లు చోట్ల ఈ ఆదేశాలు క‌ఠినంగా అమలు అవుతున్నట్లుగా క‌నిపిస్తున్నాయి. జాతీయ గీతం ఆలపించే స‌మ‌యంలో గౌర‌వ సూచ‌కంగా నిల్చోక‌పోవ‌డంతో ఇద్దరు యువతులతోపాటు ఆరుగురు యువకులపై చెన్నైలో గ‌త ఏడాది కేసు న‌మోదైంది. త‌ద్వారా జాతీయ గీతాన్ని గౌర‌వించ‌లేదంటూ న‌మోదైన మొద‌టి కేసుగా నిలిచిపోయింది. అంతే కాకుండా ఈ సంఘ‌ట‌న‌ ప్రేక్ష‌కుల‌ మ‌ధ్య వివాదానికి కూడా కార‌ణ‌మ‌వుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు