ఫోటోతో అడ్డంగా దొరికిపోయిన పాక్‌

ఫోటోతో అడ్డంగా దొరికిపోయిన పాక్‌

త‌ప్పును ఎంత దాచాల‌న్నా దాచ‌లేం. ఇక అబ‌ద్ధాన్ని ఎంత మసిపూసి మారేడు కాయ చేసినా అది ఏదో రోజు బ‌య‌ట‌ప‌డిపోతుంది. భార‌త్ అంటే చాలా మండిప‌డుతూ.. నిత్యం విషం చిమ్మే పాక్ ధోర‌ణి ఎంత దారుణంగా ఉంటుంద‌న్న విష‌యం తాజాగా బ‌య‌ట‌కు వచ్చింది. ఐక్య‌రాజ్య స‌మితిలో భార‌త్ పై నింద‌లు మోపే క్ర‌మంలో పాక్ ప్ర‌ద‌ర్శించిన ఫోటో.. ఇప్పుడా దేశాన్ని అంత‌ర్జాతీయంగా న‌వ్వుల‌పాల‌య్యేలా చేసింది.

ఐక్య‌రాజ్య స‌మితిలో భార‌త్ పై నింద‌లు వేసే ప్ర‌య‌త్నం చేసిన పాక్‌.. ఒక అబ‌ద్ధ‌పు ఫోటోతో నిజ‌మ‌ని చెప్ప‌టానికి ప్ర‌య‌త్నించి దొరికిపోయింది. ముఖ‌మంతా పెల్లెట్ గాయాల‌తో ఉన్న ఒక యువ‌తి ఫోటోను చూపించి.. కశ్మీర్‌లో మ‌హిళ‌ల ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుసా అంటూ స‌న్నాయినొక్కులు నొక్కే ప్ర‌య‌త్నం చేసింది. అయితే.. పాక్ ప్ర‌ద‌ర్శించిన ఫోటో కశ్మీర్ ది కాదు.. గాజా ప్రాంతానికి చెందిన యువ‌తి అన్న విష‌యాన్ని గుర్తించారు. దీంతో.. సంబంధం లేని ఫోటోను చూపించి.. భార‌త్ మీద నింద‌లు వేసే ప్ర‌య‌త్నం చేసిన పాక్ అసలు రంగు ప్ర‌పంచానికి తెలిసిపోయింది.

పాక్.. ఉగ్ర‌వాద కర్మాగారంగా మారిందంటూ ఐక్య‌రాజ్య స‌మితి స‌ర్వ‌ప్ర‌తినిధుల స‌భ‌లో ప్ర‌సంగించిన సంద‌ర్భంగా కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ నిప్పులు చెరిగారు. దీనికి కౌంట‌ర్ ఇవ్వాల‌ని భావించిన పాక్ శాశ్వ‌త ప్ర‌తినిధి మ‌లీహ లోధి ప్ర‌సంగించారు. ఆమె త‌న ప్ర‌సంగంలో భాగంగా ముఖ‌మంతా తీవ్ర గాయాల‌తోఉన్న యువ‌తి ఫోటో చూపించి క‌శ్మీర్ లో పెల్లెట్ల బారిన ప‌డిన బాధితురాలిగా ఆమె చెప్పారు.

ఐక్య‌రాజ్య‌స‌మితి
అయితే.. ఆ ఫోటోకు భార‌త్‌కు ఏమాత్రం సంబంధం లేదు. ఎందుకంటే పాక్ ప్ర‌ద‌ర్శించిన ఫోటో క‌శ్మీరీ కాదు.. గాజా ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల ర‌వా అబు జోమా. 2014లో గాజా న‌గ‌రంపై జ‌రిగిన వైమానిక దాడిలో ఆమె తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. గాయాల‌తో దీనంగా చూస్తున్న ఆమెను జెరూస‌లేంకు చెందిన హైదీ లెవీన్ ఫోటో తీశారు. ఈ ఫోటోకు అంత‌ర్జాతీయంగా అవార్డు కూడా వ‌చ్చింది. ఇంత ఫేమ‌స్ అయిన ఆ ఫోటోను కశ్మీరీ యువ‌తి దంటూ పాక్ ప్ర‌ద‌ర్శించిన ఫోటో ఇప్పుడా దేశాన్ని న‌వ్వుల పాలయ్యేలా చేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ ఫోటో తీసిన ఫోటోగ్రాఫ‌ర్ 2015 మార్చి 27న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు కూడా. ప్ర‌పంచంలో ఏ మూల‌న ఉన్న‌దైనా స‌రే క్ష‌ణాల్లో ముందుకు తెచ్చి పెట్టే గూగుల‌మ్మ ఉన్న వేళ‌.. ఇలా సంబంధం లేని ఫోటోల్ని ప్ర‌పంచానికి చూపించిన వైనం చూస్తే పాక్ ఎంత తెలివి త‌క్కువ‌న్న విష‌యం ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ఫోటోతో అడ్డంగా బుక్ అయిన పాక్ ఇప్పుడు అంత‌ర్జాతీయ స‌మాజంలో న‌వ్వుల‌పాలైంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు