టీడీపీలో చేరనున్న న‌లుగురు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవ‌రంటే

టీడీపీలో చేరనున్న న‌లుగురు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవ‌రంటే

ఏపీలో కాస్త గ్యాప్ త‌ర్వాత మ‌రోమారు పార్టీ ఫిరాయింపుల ప‌ర్వం తెర‌మీద‌కు వ‌చ్చింది. స‌హ‌జంగానే ఇది ప్ర‌తిప‌క్ష వైసీపీ నుంచి అధికార టీడీపీలోకి అయితే ఈ ద‌ఫా అత్యంత‌త ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమిటంటే..సాక్షాత్తు ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి సొంత జిల్లా అయిన క‌డ‌ప నుంచి జంపింగ్‌లు ఉండ‌టం. ఈ జంపింగ్‌ల‌కు మ‌ధ్య‌వ‌ర్తిగా ఉన్న‌ది కూడా పార్టీ ఫిరాయించిన నేత కం మంత్రి కావ‌డం! కడప జిల్లాలో జ‌రుగుతున్న చ‌ర్చ ప్ర‌కారం ప్రతిపక్ష పార్టీకి చెందిన వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం అయింది. ఇందుకోసం ఆ పార్టీ ప్రతినిధులతోనూ, జిల్లా మంత్రి సి.ఆదినారాయణరెడ్డి నేతృత్వంలో సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం.

కడప పార్లమెంటరీ నియోజకవర్గానికి చెందిన ఇరువురు వైసీపీ మ్మెల్యేలు, రాజంపేట పార్లమెంట్‌కు చెందిన మరో ఇరువురు వైసీపీ ఎమ్మెల్యేలు వారం రోజుల కిందట టీడీపీ నేతలతో ఎడతెరిపిలేకుండా చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తాజాగా వారం రోజుల క్రితం ఇరువురు ఎమ్మెల్యేలు బెంగళూరులో మంత్రి సి.ఆదినారాయణరెడ్డి సమక్షంలో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

గతంలో ఆ వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ నేతలతో కూడా చర్చలు జరిపారు. అయితే ఈ విష‌యం బ‌య‌ట‌కు పొక్క‌డం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రంగంలో దిగడంతో వారు టీడీపీలో చేరకుండా విరిమించుకున్నారు. అయితే, నంద్యాల ఉపఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోవడం, పార్టీ మారితే తప్ప రాజకీయ భవిష్యత్ ఉండదని పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు భావించి పార్టీలు మారుతున్నట్లు తెలుస్తోంది. అయితే తమకు టీడీపీ టికెట్ కేటాయింపుపై స్పష్టమైన హామి ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఆ నాలుగు నియోజకవర్గాల్గోని టీడీపీ నేతలు మాత్రం ఆ ఎమ్మెల్యేలు వస్తే మా పరిస్థితేంటని ఆందోళన చెందుతూ, వారి రాకను గట్టిగా వ్యతిరేకిస్తున్నారు.

గతంలో తెలుగుదేశం పార్టీలో కొనసాగిన వైసీపీ నేత‌లే కాబ‌ట్టి తిరిగి తమ మాతృపార్టీలోకి చేర‌డమే శ్రేయస్కరమేనని భావించి గతంలో వారికున్న టీడీపీ నేతల సంబంధాలు ఈ చర్చల్లో కొంతమేరకు అనుకూలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే 2019 ఎన్నికల్లో తమకు పార్టీ టికెట్ ఇస్తామంటే పార్టీలో చేరుతామని కొంతమంది కండిషన్లు పెడుతున్నారు. టీడ‌పీఈ అధిష్ఠానం మాత్రం తొలుత పార్టీలో చేరి పనిచేయాలని తర్వాత టికెట్‌మాట మాట్లాడాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ అధిష్ఠానం వైసిపి ఎమ్మెల్యేలతో మాత్రం 2019కి ఎలాగూ వైసీపీ అధికారంలోకి రాదని, టీడీపీలో చేరితే తగిన గుర్తింపు ఇస్తామని పార్టీలో చేరిన తర్వాత మాట్లాడుతామని సమాధానం ఇస్తుండటంతో పార్టీలో చేరేందుకు వైసీపీ నేతలు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మ‌రోవైపు జిల్లాలో తెలుగుదేశంపార్టీ నేతలు వైసీపీ ఎమ్మెల్యేల వలసలపై బ‌హిరంగంగా నోరుమెదపకపోయిన‌ప్ప‌టికీ వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తే తమ రాజకీయ భవితవ్యం ఏమిటని కూడా టీడీపీ సీనియర్ల వ‌ద్ద గ‌ట్టిగానే వాదిస్తున్న‌ట్లు స‌మాచారం. మొత్తంమీద నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు పలువురు జిల్లా  నేతలతో చర్చలు జరుపుతున్నది మాత్రం నిజ‌మ‌ని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English