పనిగట్టుకుని మరీ రచ్చకీడుస్తున్నాడు

పనిగట్టుకుని మరీ  రచ్చకీడుస్తున్నాడు

నిజంగా ప్రజాసమస్యలు ఉంటేనే, న్యాయవ్యవస్థ జోక్యం తప్పనిసరి అనిపిస్తేనో నాయకులు, తమ ప్రత్యర్థి పక్షాల మీద కోర్టును ఆశ్రయించడం తప్పు కాదు. అయితే.. కోర్టులో కేసులు వేయగల అనుభవం తనకు ఉన్నది గనుక.. రాజకీయ ప్రయోజనాల కోసం, ప్రత్యర్థులను ఇబ్బందిపెట్టడం కోసం, పాలక పక్షాలను సజావుగా పనిచేయనివ్వకుండా బ్రేకులు వేయడం కోసం కేసులు వేస్తే ఎలా? కోర్టుతో ఆటలాడితే కుదర్దు కదా..! వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి కూడా ఈ విషయమే ఇప్పుడు స్వానుభవంలో ఎదురైంది. ఆంధ్రప్రదేశ్ లో అతి తక్కువ ధరలకే అందరికీ కేబుల్ కనెక్షన్లు అందించేలా.. ఏపీ ప్రభుత్వం కూడా ఆరంగంలోకి భాగస్వామిగా ఎంటరవుతున్న నేపథ్యంలో దానికి వ్యతిరేకంగా ఆళ్ల రామకృష్ణా రెడ్డి వేసిన కేసును హైకోర్టు కొట్టేసింది.

ఫైబర్ నెట్ గ్రిడ్ ద్వారా అతి తక్కువ ధరకే రాష్ట్రవ్యాప్తంగా కేబుల్ టీవీ ప్రసారాలను అందించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. కేబుల్ , ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ అన్నీ చౌకధరకే అందించే ప్రయత్నం జరుగుతోంది. దీన్ని గురించి సీఎం పలుమార్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్టులో ఏపీ ప్రభుత్వం కూడా భాగస్వామిగా ఉంటుంది.

అయితే ప్రభుత్వం మీడియా ప్రసార రంగాల నిర్వహణలో ఉంటే.. ప్రసారాలు మొత్తం ఏకపక్షంగా ఉంటాయని అంటూ.. ఇలాంటి భాగస్వామ్యం చట్టవిరుద్ధమని ఆపాదిస్తూ ఆళ్ల రామకృష్ణా రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ వేసిన ఆళ్ల.. తన వాదనకు మద్దతుగా సరైన ఆధారాలు చూపలేకపోయారంటూ.. హైకోర్టు దానిని తోసిపుచ్చింది. ఆయన తన వాదనకు మూలంగా.. ట్రాయ్ చేసిన సిఫారసులను మాత్రమే చూపించారు తప్ప.. వాటి ఆధారంగా ఎలాంటి చట్టం తయారైనట్లుగా చూపించలేకపోయారని.... ట్రాయ్ సిఫారసుల వలన ప్రభుత్వాన్ని నియంత్రించడం కుదరదు అని కోర్టు వ్యాఖ్యానించింది.

ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ తరఫున చంద్రబాబునాయుడు ప్రభుత్వ వ్యవహారాలకు వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేయడంలో దిట్ట. తాజాగా సదావర్తి భూముల విషయంలో ఆయన పిటిషన్ కు విజయం లభించింది. అదే ఊపులో.. ఆయన మరీ ప్రభుత్వాన్ని పనిగట్టుకుని రచ్చకీడుస్తున్నట్లుగా చట్టవ్యతిరేకం కాని విషయాలను కూడా.. చట్టవ్యతిరేకంగా పేర్కొంటూ ఈ కేబుల్ రంగం గురించిన పిటిషన్ వేశారు. దానిని తొలిదశలోనే గుర్తించి.. కోర్టు తోసిపుచ్చింది. తనకు గౌరవం స్థిరంగా ఉండాలంటే.. ఇలాంటి పసలేని పిటిషన్ల జోలికి వెళ్లరాదని ఆళ్ల కూడా తెలుసుకోవాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు