డేరా ఆశ్ర‌మంలో 600 అస్తి పంజ‌రాలు!

డేరా ఆశ్ర‌మంలో 600 అస్తి పంజ‌రాలు!

ఒక ప‌చ్చ‌టి ఉద్యాన‌వ‌నంలో చ‌క్క‌గా పూల మొక్క‌లు నాటి ఉంటాయి. ఆ పూల మొక్క‌ల‌కు విల‌న్ స్వ‌యంగా నీరు పోసి శ్ర‌ద్ధ‌గా పెంచుతుంటాడు. త‌న మాట విన‌ని వారిని విల‌న్ దారుణంగా హ‌తమార్చి ఆ పూల‌తోట‌లో పాతిపెడుతుంటాడు. ఆ పూల మొక్క‌ల కింద శ‌వాల‌ను పాతిపెట్టార‌న్న సంగ‌తి హీరో ప‌సిగ‌డ‌తాడు.  ఆ విల‌న్ గుట్టు ర‌ట్టు చేసి మొక్క‌ల కింద ఉన్న అస్థిపంజ‌రాల‌ను హీరో వెలికి తీస్తాడు. ఇదంతా ఓ తెలుగు సినిమాలో హీరో, విల‌న్ ల మ‌ధ్య జ‌రిగే కీల‌క ఘ‌ట్టం. అదే త‌ర‌హాలో సిర్సాలోని డేరా స‌చ్చా సౌదా ప్ర‌ధాన ఆశ్ర‌మంలో 600 అస్థిపంజ‌రాలు దొరికాయి. ఇంత భారీ సంఖ్య‌లో అస్థిపంజ‌రాలు దొర‌క‌డం సిట్ అధికారుల‌ను విస్మ‌యానికి గురి చేసింది. డేరా బాబా కొన్ని హ‌త్య‌లు చేయించాడ‌ని, త‌మ త‌నిఖీల్లో కొన్ని అస్థిపంజ‌రాలు ల‌భించ‌వ‌చ్చ‌ని అధికారులు భావించారు. కానీ, ఈ రేంజ్ లో అస్థిపంజ‌రాలు ల‌భించ‌డంతో వారు షాక్ అయ్యారు.

డేరా సచ్చా సౌదా ఆశ్ర‌మంలో జ‌రిగిన అక్ర‌మాలు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ ఆశ్ర‌మంలో పేలుడు ప‌దార్థాల ఫ్యాక్ట‌రీ నిర్వ‌హించ‌డం, మ‌హిళ‌ల అబార్ష‌న్ ల కోసం ప్ర‌త్యేక విభాగం ఉండడం వంటి విష‌యాలు సిట్ విచార‌ణ‌లో వెలుగుచూశాయి. అయితే, డేరా ఆశ్ర‌మానికి వెళ్లిన తర్వాత క‌నిపించ‌కుండా పోయిన కొంత‌మందిని హ‌త్య చేసి అక్క‌డే పాతిపెట్టారనే సంగ‌తి తెలిసిందే. అయితే, ఆ విధంగా హ‌త్య‌కు గురైన వారి సంఖ్య 10-20 వ‌ర‌కు ఉండ‌వ‌చ్చ‌ని అధికారులు భావించారు. అయితే, ఆ ఆశ్ర‌మంలో దాదాపు 600కు పైగా అస్తిపంజరాలు ల‌భించ‌డంతో సిట్ అధికారులు షాక్ అయ్యారు. అంతేకాదు, ప్రతి అస్తి పంజరంపైనా ఓ అందమైన పూల మొక్క నాటినట్లు అధికారులు గుర్తించారు. సినీ ఫ‌క్కీలో ఈ వ్య‌వ‌హారం న‌డ‌ప‌డం అధికారుల‌ను విస్మ‌యానికి గురి చేసింది.

ఆ అస్తి పంజరాల‌పై డేరా బాబా అనుచ‌రుల వాద‌న మ‌రోలా ఉంది. మోక్షం కోసం చనిపోయిన వారి మృతదేహాలను ఆశ్రమంలో పాతిపెట్టామ‌ని డేరా బాబా అనుచరులు చెబుతున్న విషయం తెలిసిందే. డేరా బాబాకు ఎదురు తిరిగిన వారిని హ‌త్య చేసి, ఆశ్ర‌మంలోనే పాతి పెట్టార‌ని, ఆ సంఖ్య 1000 వ‌ర‌కు ఉంటుంద‌నే వాద‌న వినిపిస్తోంది. డేరా ఆశ్ర‌మంలో మరిన్ని తవ్వకాలు జరపాలని, కనిపించకుండా పోయిన వారు హ‌త్య‌కు గురై ఉంటార‌ని హ‌రియాణాకు చెందిన ప్రముఖ జర్నలిస్టు రామానంద్‌ తాతియా ఆరోపించారు. త‌న మాట విన‌ని వారిని గుర్మీత్ దారుణంగా హ‌త‌మార్చేవాడ‌ని, ఎవ‌రికీ తెలియ‌కుండా వారిని ఆశ్రమంలోనే పాతిపెట్టించేవాడని ఆరోపించారు. డేరా ఆశ్ర‌మంల మ‌రిన్ని త‌వ్వ‌కాలు జ‌రిపితే నిజానిజాలు వెలుగులోకి వ‌స్తాయ‌ని చెప్పారు. జాతీయ‌ మీడియా సమక్షంలో ఆశ్రమంలో తవ్వకాలు జరపాలని కోరారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు