మీ నాన్న లాగా చేయ‌కు...లోకేష్‌తో కేంద్ర‌మంత్రి

మీ నాన్న లాగా చేయ‌కు...లోకేష్‌తో కేంద్ర‌మంత్రి

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు, ఆ రాష్ట్ర ఐటీ, పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని ఒక‌టి పంచుకున్నారు. మంత్రిగా ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత మొద‌టిసారి శ్రీ‌కాకుళం జిల్లాలో ప‌ర్య‌టించిన లోకేష్ ఈ సంద‌ర్భంగా పలు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. ఇందులో ప్ర‌ధానంగా ఉద్దానం ప్రాంతాల కిడ్ని వ్యాధి ప్రభావిత గ్రామాలకు సురక్షిత తాగునీటిని అందించేందుకు 2 కోట్ల 15 లక్షల వ్యయంతో హబ్ అండ్ స్పోక్ మోడల్ లో నిర్మించిన ఎన్టీఆర్ సుజల ప్లాంట్‌ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. అనంత‌రం ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరాను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మాలు పూర్త‌యిన అనంత‌రం బ‌హిరంగ స‌మావేశంలో లోకేష్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

శ్రీకాకుళం జిల్లా పలాస జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన‌ బహిరంగ సభలో మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో రూ.5 వేల కోట్ల ఉపాధి హామీ ప‌నుల‌కు సంబంధించిన ఉప‌క‌ర‌ణాల‌ను కేంద్ర ప్రభుత్వానికి తిప్పి పంపించార‌ని తెలిపారు. కాంగ్రెస్ వారు గ్రామాల గురించి ఏనాడు పట్టించుకోలేదని మండిప‌డ్డారు. అయితే శ్రీ‌కాకుళః జిల్లాలోని గ్రామాల్లో ఇప్పటికి 800కి.మీటర్లు సీసీ రోడ్లు వేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిద‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగానే ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఒక‌టి లోకేష్ వెల్ల‌డించారు. ``కొద్దికాలం క్రితం కేంద్ర మంత్రి తోమర్‌కు నేను ఫోన్ చేసి సర్.. నేను ఆంధ్రప్రదేశ్ కు కొత్త పంచాయతీరాజ్ శాఖ మంత్రిని అని చెప్పాను. దానికి మంత్రి తోమర్ మాట్లాడుతూ.. `మీ నాన్నలా ఉండకు.. ఆయన ఎప్పుడు వచ్చినా మా రాష్ట్రానికి ఒక రూ. వెయ్యి కోట్లు ఇవ్వండి అని తీసుకెళ్తారు. నువ్వు కూడా వచ్చి నన్ను ఇబ్బంది పెడితే.. ఇతర రాష్ట్రాల వారు కూడా నన్ను ఇబ్బంది పెడతారు.. అర్థం చేసుకో`అన్నారు`` అంటూ లోకేష్ వివ‌రించారు.

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ ,గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ,కిషన్ లాల్ గారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన 550 స్కూల్ బెంచులను ఈ సంద‌ర్భంగా ప్రభుత్వ పాఠశాలకు మంత్రి నారా లోకేష్‌ అందించారు. 10వ తరగతి పిల్లలతో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ఎన్నడూ లేని విధంగా నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు పిల్లల చేతుల్లో ఉంది. కష్టపడి చదువుకోవాలని సూచిస్తూ విద్యార్థులు ఉపాధ్యాయులను గౌరవించాలని కోరారు. రాబోయే రెండు సంవత్సరాల్లో లక్ష ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామ‌ని లోకేష్ ప్ర‌క‌టించారు. 2 లక్షల ఎలక్ట్రానిక్ ఉద్యోగాలు రాబోతున్నాయని కష్టపడి చదువుకుంటే మీ అందరికి మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు