హైదరాబాద్‌లోనే పది వేల ఐటీ ఉద్యోగాలు పోయాయి

హైదరాబాద్‌లోనే పది వేల ఐటీ ఉద్యోగాలు పోయాయి

సాధార‌ణంగా ఐటీ ప‌రిశ్ర‌మ‌లో యూనియ‌న్లు, నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు వంటివి ఉండ‌నే ఉండ‌వు. మేథో కార్మికుల‌యిన టెకీలు మిగ‌తా కార్మికులకు/ఉద‌్యోగుల‌కు భిన్నంగా త‌మ పని తాము చేసుకుంటూ పోతున్నారు. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. టెకీలు కూడా రోడ్డెక్కుతున్నారు. ఈ మూడు నెలల కాలంలో వివిధ కంపెనీల నుంచి దేశవ్యాప్తంగా 25 వేల మందిని తొలగించగా హైదరాబాద్‌లోనే పది వేల మందిని ఇంటికి పంపించారు.

ఈ నేపథ్యంలో ఐటీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రతపై భయాందోళన నెలకొంది. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఫోరమ్‌ ఫర్‌ ఐటీ ప్రొఫెషనల్స్‌ ఆధ్వర్యంలో ఐటీ ఉద్యోగులు హైదరాబాద్‌లోని కార్మికశాఖ కమిషన్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. మొదటిసారిగా ఉద్యోగ భద్రతపై ఐటీ ఉద్యోగులు చేయడం గమనార్హం.

విప్రో, టెక్‌మహీంద్ర, కాగ్నిజెంట్‌ సంస్థల్లో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కారణం లేకుండా ఉద్యోగం నుండి ఒక్కొక్కరిని తొలగించడంపై ఐటీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఐటీ ఉద్యోగుల తొలగింపుపై శ్వేతపత్రం విడుదల చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఫోరం ఫర్‌ ఐటీ ప్రొఫెషనల్స్ ప్ర‌తినిధులు మాట్లాడుతూ ఐటీ కంపెనీ యాజమాన్యాలు కార్మిక చట్టాలను తుంగలో తొక్కి అన్యాయంగా ఉద్యోగులను తొలగిస్తున్నారన్నారు. ఇదేంటని ప్రశ్నించిన ఉద్యోగుల పట్ల గూండాలుగా వ్యవహరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.

 'మేము చట్టాలను పట్టించుకోము.. మా కిష్టమొచ్చిది చేస్తాం`అని యాజమాన్యాలు చెప్పడం బాధాకరమన్నారు. షాప్స్‌ అండ్‌ ఎస్టాబిలేషన్‌ ఆఫ్‌ తెలంగాణ యాక్ట్‌ 47/2 ప్రకారం ఉద్యోగులు పిటీషన్‌ వేస్తే అవి పెండింగ్‌లో ఉన్నప్పుడు ఏ ఒక్క ఉద్యోగిని తొలగించడానికి యాజమాన్యానికి ఎలాంటి హక్కు ఉండదన్నారు. అయినా కార్మిక చట్టాలను పాటించకుండా విప్రో, టెక్‌మహీంద్ర లాంటి కంపెనీలు అక్రమాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. త‌మ‌కు న్యాయం చేయాల‌ని వారు కార్మిక శాఖ అధికారుల‌ను కోరారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు