ఉత్త‌ర కొరియా ఇలా రెచ్చిపోయిందేంటి?

ఉత్త‌ర కొరియా ఇలా రెచ్చిపోయిందేంటి?

త‌న దుందుడుకు వ్య‌వ‌హారంతో ప్ర‌పంచానికి స‌వాలుగా మారిన ఉత్త‌ర‌కొరియా.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు అమెరికాపై కారాలు మిరియాలు నూరింది. అమెరికా అంతు చూస్తామ‌ని ఉత్త‌ర కొరియా పాల‌కుడు కిమ్ హెచ్చ‌రించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న హైడ్రోజ‌న్ బాబు పరీక్ష‌కు ప‌చ్చ‌జెండా ఊప‌డం ద్వారా అగ్ర‌రాజ్యాన్ని ఇరుకున ప‌డేశారు. దీంతో అమెరికా ఐక్య‌రాజ్య‌స‌మితి భ‌ద్ర‌తా మండ‌లిలో ఉత్త‌ర కొరియాపై ఆంక్ష‌లు విధించేలా పావులు క‌దుపుతున్నారు. ఆ దేశం పూర్తిగా ఆర్థిక స‌మ‌స్య‌ల్లో చిక్క‌కుపోయేలా, అన్ని దేశాల నుంచి ఉత్త‌ర కొరియాకు వ్య‌తిరేక‌త వ‌చ్చేలా అమెరికా తెర వెనుక పెద్ద ఎత్తున ప్ర‌య‌త్నం చేస్తోంది. ఈ క్ర‌మంలో అమెరికాకు మిత్ర ప‌క్షాలు స‌హ‌క‌రించాల‌ని ట్రంప్ విజ్ఞ‌ప్తి చేశాడు.

ఈ నేప‌థ్యంలో జ‌పాన్ అమెరికాతో చేతులు క‌లిపింది. ఉత్త‌ర కొరియా ప‌నిప‌ట్టేందుకు అమెరికాతో ముందుకు వెళ్తామ‌ని ప్ర‌క‌టించింది. దీంతో ఇప్పుడు ఉత్త‌ర కొరియా జ‌పాన్‌పై క‌న్నెర్ర చేసింది. అమెరికాతో కలిసి తమపై కుట్ర చేస్తున్న ఆ దేశాన్ని ఇక ఎంతో కాలం తమకు సమీపంగా ఉంచబోమ‌ని,  సముద్రంలో ముంచెస్తామని తీవ్ర‌స్థాయిలోఉత్త‌ర కొరియా హెచ్చ‌రించింది. జపాన్‌కు చెందిన  నాలుగు ద్వీపాలను ఒకే ఒక్క‌ అణుబాంబుతో చిత్తు చేసి సముద్రంలో ముంచేస్తామని, దాంతో ఇక జపాన్  ప‌ని ఖ‌తం అని ఉత్త‌ర కొరియా వ్యాఖ్యానించింది.  అంత‌టితో ఆగ‌ని ఉత్త‌ర కొరియా ప్ర‌పంచ సంక్షేమాన్ని కాంక్షించే ఐక్యరాజ్యసమితిపైనా విరుచుకుప‌డింది.

లంచాలు తీసుకునే కొన్ని దేశాలు అన్ని కలిసి తమకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నాయని, అందులో భాగంగానే తాజాగా ఐక్య‌రాజ్య స‌మితి భ‌ద్ర‌తా మండ‌లిలో అమెరికా తీర్మాన‌మ‌ని ఎద్దేవా చేసింది.  అసలు భద్రతా మండలి అనేదే ఒక దుష్టశక్తి అని, దానిని బద్ధలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అందులో ఉన్నసభ్యత్వ దేశాలన్ని కూడా లంచం తీసుకొని పనిచేసే అవినీతి దేశాలు అంటూ తిట్టిపోసింది. అందుకే, ముందుగా తాము జపాన్‌ను టార్గెట్‌ చేసుకొని దాని భూభాగాలను సముద్రంలో ముంచివేస్తామని, దాని ద్వారా అమెరికాలో మరింత భయాన్ని సృష్టించి అక్కడ కూడా చీకట్లు నిండేలా చేస్తామంటూ హెచ్చరించింది.  మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు