ఆయన నాన్ ప్లేయింగ్ పొలిటీషియన్!

ఆయన నాన్ ప్లేయింగ్ పొలిటీషియన్!

లగడపాటి రాజగోపాల్ అంటే చిత్ర విచిత్ర నాటకీయ పరిణామాల మధ్య రాజకీయాలు నడుపుతూ పాపులర్ అయిన వ్యక్తి. అప్పట్లో సమైక్యాంధ్రను సమర్థిస్తూ... కేసీఆర్ ను వెటకారం చేస్తూ  ఆమరణ నిరాహార దీక్షకు కూచుని, చెంగున గెంతేసి ఆస్పత్రి నుంచి పారిపోయినా... పార్లమెంటులో పెప్పర్ స్ప్రే తో గందరగోళం సృష్టించినా ఆయనకే చెల్లుతుంది. అయితే ఏపీ చీలిపోయిన తర్వాత.. కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టినట్లే అని ముందే గ్రహించిన లగడపాటి రాజగోపాల్.. వ్యూహాత్మకంగా రాజకీయాలనుంచి తప్పుకున్నారు. ఇటీవలి కాలంలో చంద్రబాబునాయుడు కోటరీలో కీలకంగా కనిపిస్తూ ఉన్నారు. మంతనాలు మాత్రం సాగిస్తున్నారు. తాజాగా కూడా చంద్రబాబును వచ్చి కలిసిన లగడపాటి.. తాను మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని,  ఒకసారి వదిలేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత.. ఇక పునరాలోచన లేదని తేల్చేశారు.

అయితే తెలుగుదేశం వర్గాల్లో వినిపిస్తున్న కబురు ఏంటంటే.. ఆయన తమ పార్టీలోనే ఒక నాన్ ప్లేయింగ్ పొలిటీషియన్ లా మారిపోయాడని అంటున్నారు. లగడపాటి రాజకీయాల్లోకి రారు, రాజకీయాలు చేయరు, ఎన్నికల సర్వేలు గట్రా చేయిస్తే.. వాటిని కేవలం తమ సొంత ఆసక్తితో మాత్రమే చేయిస్తారు. అంతే తప్ప.. వాటికి రాజకీయానికి సంబంధం లేదు... ఇవన్నీ బయటకు చెప్పుకోడానికి బాగానే ఉంటాయని.. కానీ తెర వెనుక అయినా సరే.. ఆయన దాదాపుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మారిపోయినట్లేనన ఆ పార్టీ వారే చెప్పుకుంటున్నారు.

లగడపాటి రాజగోపాల్.. సర్వేల్లో నిపుణుడు.  మొన్నటికి మొన్న నంద్యాల ఉప ఎన్నిక విషయంలో కూడా దాదాపుగా లగడపాటి రాజగోపాల్ చెప్పిన జోస్యం ప్రకారమే ఫలితాలు వచ్చాయి. తెలుగుదేశం గెలుపు గ్యారంటీ అన్న లగడపాటి.. బహిరంగంగా  మెజారిటీ గురించి చెప్పకపోయినా.. పార్టీ వర్గాలతో మాత్రం 30 వేల వరకు మెజారిటీ వస్తుందని అన్నట్లుగా సమాచారం. ఆ ప్రకారమే ఫలితాలు వచ్చాయి. అయితే ఆయన ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనతో మాత్రం లేరని.. పరస్పర లబ్ధి చేకూరగల అనుబంధాన్ని మాత్రమే చంద్రబాబునాయుడుతో కొనసాగిస్తున్నారని తాజా వ్యవహారాల వల్ల అర్థమవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English