వీళ్లంతా న‌కిలీ బాబాలే...

వీళ్లంతా న‌కిలీ బాబాలే...

డేరా బాబా గుర్మిత్ రామ్‌ర‌హీం సింగ్ ఆగ‌డాలు వెలుగులోకి వ‌చ్చిన నేప‌థ్యంలో న‌కిలీ  బాబాల‌పై ప‌లువురి దృష్టి ప‌డిన సంగ‌తి తెలిసిందే. తమను తాము దైవాంశ సంభూతులుగా ప్రకటించుకున్న పలువురు బాబాలు ఇటీవలికాలంలో వరుసగా వివాదాలకు కేంద్రబిందువులుగా మారుతున్న నేపథ్యంలో నకిలీ బాబాల జాబితాను హిందూ సాధువుల అత్యున్నత సంస్థ అఖిల భారతీయ అఖాడా పరిషత్ విడుదల చేసింది. వివాదాస్ప‌ద రాదేమా, అసిమానంద, ఓంబాబా తదితర 14 మంది దేవుడి పేరుతో హిందూ మతానికి మచ్చ తెస్తున్నారని పేర్కొంది.

అలహాబాద్‌లో జరిగిన అఖాడా పరిషత్ సమావేశంలో 300మందికి పైగా సాధువులు పాల్గొన్నారు. నకిలీ బాబాల మాయమాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలను కోరాలని సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఈ మేరకు 14మంది పేర్లతో కూడిన జాబితాను విడుదల చేశారు.

ఇటీవలే లైంగికదాడి నేరంపై 20 ఏళ్ల‌ జైలుశిక్ష పడిన డేరా బాబా గుర్మీత్ రాంరహీంసింగ్, గృహహింస, బెదిరింపుల వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాధేమా, లైంగికదాడి ఆరోపణలపై ప్రస్తుతం జైలులో ఉన్న ఆసారాం బాపు, అవే ఆరోపణలు ఎదుర్కొంటూ బెయిల్‌పై బయటకు వచ్చిన ఆసారాం తనయుడు నారాయణ సాయి, హింసను ప్రేరేపించిన కేసులో ప్రస్తుతం కటకటాల వెనుక ఉన్న రాంపాల్, వీరితోపాటు నిర్మల్ బాబా, ఓం బాబా, సచినంద్ గిరి అలియాస్ సచిన్ దత్తా, ఇచ్ఛాధారి భీమానంద్, మల్ఖాన్‌సింగ్, ఆచార్య ఖుష్‌ముని, స్వామి అసిమానంద్, బృహస్పతి గిరి, ఓం నమశ్శివాయ బాబా పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.

నకిలీ బాబాల జాబితాను కేంద్రానికి, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు పంపనున్నట్లు అఖాడా పరిషత్ ప్రతినిధులు తెలిపారు. హిందూ మతాన్ని భ్రష్టు పట్టించాలని చూస్తున్న నకిలీ బాబాలకు భక్తులు దూరంగా ఉండాలని, ఇలాంటి వారి వల్లే నిజమైన సాధువులకు చెడ్డపేరు వస్తున్నదని అఖాడా పరిషత్ అధ్యక్షుడు స్వామి నరేంద్ర గిరి చెప్పారు. ``ఈ జాబితాను ప్రభుత్వాలకే కాకుండా, ప్రతిపక్షాల నేతలకూ పంపుతాం. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఒత్తిడి తీసుకువస్తాం`` అని నరేంద్ర గిరి తెలిపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు