కిర‌ణ్ రీ ఎంట్రీ ఖ‌రారు..పెద్ద ప‌ద‌వే ఇస్తార‌ట‌

కిర‌ణ్ రీ ఎంట్రీ ఖ‌రారు..పెద్ద ప‌ద‌వే ఇస్తార‌ట‌

స‌మైక్యాంధ్ర‌ప్ర‌దేశ్ చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజ‌కీయ ప్ర‌స్థానంపై క్లారిటీ వ‌చ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈమేరకు ఇటు కిర‌ణ్ అటు ఆయ‌న మాజీ గూడు స్ప‌ష్ట‌త‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. అనూహ్య రీతిలో ముఖ్యమంత్రిగా 2010 నుంచి 2013 వరకూ పనిచేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి విభజనకు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయాన్ని ధిక్కరించిన సంగతి తెలిసిందే.

అధిష్ఠానం ఆదేశించినా ఆయన స్పందించకుండా విభజనకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఎన్నికల సమయంలో జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించి అధ్యక్షుడి హోదాలో రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో అభ్యర్థులను పోటీలో పెట్టారు. అయితే ఎక్కడా ఆయన పార్టీకి ఆదరణ లభించలేదు. ఆ తరువాత మైనం వహించిన కిరణ్ రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు.

అయితే తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్‌కుమార్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోతిరిగి సొంతగూటికి చేరనున్నట్లు సమాచారం. విభజన సమయంలో ఉమ్మడి రాష్ట్రం చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన సొంత పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించినప్ప‌టికీ మూడేళ్ల తరువాత ఆయన తిరిగి సొంత గూటికి చేరనున్నారు. ఇప్ప‌టికే చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్లు స‌మాచారం. రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ సభ్యత్వం తిరిగి అందుకోవ‌డం ఉంటుంద‌ని అంటున్నారు. రాహుల్ రాష్ట్రానికి వచ్చే తేదీలను బట్టి కిరణ్‌కుమార్‌రెడ్డి చేరిక తేదీ, వేదిక నిర్ణయం కానున్నట్లు కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాహుల్ సభను తిరుపతి లేదా విజయవాడలో నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

వాస్తవానికి కిరణ్ ఈనెల 12వ తేదీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరిగింది. అయితే రాహుల్ పర్యటన తేదీలు ఖరారు కానందున ఆరోజు చేరే అవకాశం లేదని కాంగ్రెస్ నేతలంటున్నారు. ఈ నెలాఖరులోపు కిరణ్ పార్టీలో చేరుతారని అదే రోజు ఆయనను ఏఐసిసి కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అవుతాయని కాంగ్రెస్ నేతలు వెల్లడిస్తున్నారు.ఇత‌ర పార్టీల్లో ద‌క్కే గౌర‌వం కంటే  సొంతగూటికి చేరి పార్టీని మరోమారు బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు