బైరెడ్డితో చంద్ర‌బాబుకు లాభం ఏంత‌?

బైరెడ్డితో చంద్ర‌బాబుకు లాభం ఏంత‌?

బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి....తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగువెలిగిన మాజీ నాయ‌కుడు. అయితే రాయలసీమ పరిరక్షణ సమితి (ఆర్‌పీఎస్‌)పేరుతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని మొద‌లుపెట్టారు. ఐదేళ్ల పాటు నడిపిన ఈ వేదిక‌ను న‌డిపిన బైరెడ్డి ఆర్‌పీఎస్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే బైరెడ్డి చూపు ఇప్పుడు అధికార తెలుగుదేశం పార్టీపై ప‌డిన‌ట్లు తెలుస్తోంది. చాప‌చుట్టేసిన బైరెడ్డి టీడీపీ అధినేత చంద్ర‌బాబును ఆశ్ర‌యించి పున‌రావ‌సం పొంద‌డానికి సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు బాబు ఏం చేయ‌న‌న్నార‌నేది ఆస‌క్తిక‌రం.

కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజ కవర్గం పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామ శివారులోని కృష్ణానది ఒడ్డున బైరెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై చర్చించేందుకు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ ఉద్యమాన్ని ప్రజలు ఆదరించనందువల్లే, ప్రత్యామ్నాయం కోసం రాయలసీమ ఉద్యమ కాడిని కింది దించేశానన్నారు. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి కాడిని ఎత్తుకోవచ్చని బైరెడ్డి కోరారు. దివంగ‌త ఎన్‌టిఆర్‌ పిలుపుతో తాను 1994లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానని గుర్తు చేశారు. పదేళ్లపాటు ఎమ్మెల్యేగా సాగునీటి ప్రాజెక్టులు, నందికొట్కూరు నియోజకవర్గం కోసం రాజీలేని పోరాటం చేశానని బైరెడ్డి చెప్పుకొచ్చారు. సోనియాగాంధీ రాష్ట్ర విభజన చేసిన సమయంలో రాయలసీమ పూర్తిగా అన్యాయానికి గురవుతుందనే ఆందోళనతో 2013లో ప్రత్యేక రాయలసీమ కోసం ఉద్యమాన్ని చేపట్టానని...ఉద్యమం సందర్భంగా ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పట్టారని ఆనాటి సంద‌ర్భాన్ని నెమ‌రువేసుకున్నారు.

అయితే ప్రస్తుతం సీమ ఉద్యమాన్ని ఆదరించే వారు లేరని నంద్యాల ఉపఎన్నికతో నిరూపితమైందని బైరెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్రజలకు ఇష్టంలేని ఉద్యమం చేయడం వృథా అని, అందుకే రాయలసీమ ఉద్యమాన్ని ఆపేస్తున్నానని, ఇక్కడే కృష్ణా నదిలో సమాధి చేస్తున్నట్లు చెప్పారు. మరో వారం రోజుల్లో అందరి అభిప్రాయాలు తీసుకుని, తనస్థాయికి తగట్టు, తనను గౌరవించే పార్టీలో చేరుతానని చెప్పారు. బైరెడ్డి కామెంట్లు చూస్తే ఆయ‌న దారి అధికార పార్టీవైపేన‌ని అంటున్నారు. గ‌తంలో చంద్ర‌బాబును చెడామ‌డా తిట్టేసిన బైరెడ్డి ఇప్పుడు ఆయ‌న ద‌గ్గ‌రికి వెళ్లి బ‌తిమాలుకోవాల్సి వ‌స్తుందా అని ప‌లువురు సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నిక‌లో త‌న‌ను బ‌రిలో నిలిపిన అభ్య‌ర్థిని కేవ‌లం 154 ఓట్లు సాధించిన వ్య‌క్తిని బాబు ఎలా `గౌర‌విస్తారు` అనే ఆస‌క్తి అంద‌రిలో నెల‌కొంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు