హైద‌రాబాద్ నిమిజ్జ‌నం స్పీడ్ వెనుక కాకినాడ కుర్రాడు

హైద‌రాబాద్ నిమిజ్జ‌నం స్పీడ్ వెనుక కాకినాడ కుర్రాడు

భాగ్య‌న‌గ‌రిలో గ‌ణేషుని నిమ‌జ్జ‌నం అంటే చాలు.. క‌నీసం రెండు రోజుల పాటైనా ఈ ప్ర‌క్రియ సుదీర్ఘంగా సాగుతుంది. వేలాదిగా వ‌చ్చే విగ్ర‌హాల‌ను జాగ్ర‌త్త‌గా హుస్సేన్ సాగ‌ర్ లో నిమ‌జ్జ‌నం చేయ‌టం అధికారుల‌కు భారీ వ్య‌య‌ప్ర‌యాస‌ల‌కు కార‌ణ‌మ‌య్యేది. అయితే.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా వేగంగా విగ్ర‌హాల్ని నిమ‌జ్జ‌నం చేసిన తీరు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

మామూలుగా అయితే రెండు రోజుల పాటు సాగే నిమ‌జ్జ‌నం కార్య‌క్ర‌మం ఈసారి రోజులోనే పూర్తి కావ‌టం వెనుక కాకినాడ కుర్రాడి గొప్ప‌త‌నం ఉండటం ఆస‌క్తిక‌ర అంశంగా చెప్పాలి.ఈ ఇంజ‌నీరింగ్ కుర్రాడు త‌యారు చేసిన కొత్త టెక్నాల‌జీ నిమ‌జ్జ‌నాన్ని వేగంగా పూర్తి చేసేలా ఉంది.

నిమ‌జ్జ‌నంలో వినాయ‌క విగ్ర‌హాన్ని ప‌ట్టి లేపే క్రేన్లు.. సాగ‌రంలోకి ముంచే స‌మ‌యంలో హుక్కులు వీడిపోవ‌టం కాస్త ఆల‌స్య‌మ‌య్యేది. ఈ హుక్కుల చిక్కును కాకినాడ‌కు చెందిన మెకానిక‌ల్ ఇంజ‌నీర్ ముర‌ళీధ‌ర్ అధిగ‌మించాడు. ఎప్పుడు కోరుకుంటే అప్పుడు హుక్కులు వాటంత‌ట అవే వీడిపోయేలా క్విక్ రిలీజ్ డివైజ్‌ను త‌యారు చేశాడు. దీన్ని ఒక్కో క్రేన్‌కు నాలుగు చొప్పున ఈ డివైజ్‌ల‌ను ఏర్పాటు చేశారు.

దీంతో.. ఒక విగ్ర‌హాన్ని నిమ‌జ్జ‌నం చేయ‌టానికి ప‌ట్టే స‌మ‌యంలో దాదాపు నాలుగు వ‌ర‌కు విగ్ర‌హాల్ని నిమ‌జ్జ‌నం చేసే అవ‌కాశం ల‌భించింది. గ‌తంలో గంట‌కు ఎనిమిది విగ్ర‌హాలు మాత్ర‌మే నిమ‌జ్జ‌నం చేసే అవ‌కాశం ఉండేది. కాకినాడ కుర్రాడు త‌యారు చేసిన క్విక్ రిలీజ్ డివైజ్ పుణ్య‌మా అని గంట‌కు 30 విగ్ర‌హాల్ని నిమ‌జ్జ‌నం చేసే అవ‌కాశం క‌లిగింది. దీంతో.. పెద్ద ఎత్తున విగ్ర‌హాల్ని నిమ‌జ్జ‌నం చ‌క‌చ‌కా చేసే అవ‌కాశం క‌లిగింది. మొత్తంగా భాగ్య‌న‌గ‌రంలో నిమ‌జ్జ‌నం త్వ‌ర‌గా పూర్తి కావ‌టం వెనుక కాకినాడ ఇంజ‌నీర్ కృషి ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English