ఆ గేమ్ పూర్తి చేయ‌క‌పోతే..మా అమ్మ చ‌నిపోతుంది

ఆ గేమ్ పూర్తి చేయ‌క‌పోతే..మా అమ్మ చ‌నిపోతుంది

``నన్ను వదిలిపెట్టండి అంకుల్.. ప్లీజ్.. ఎలాగైనా నేను టాస్క్ పూర్తిచేయాలి. లేకపోతే అమ్మ చనిపోతుంది`` అంటూ వెక్కివెక్కి ఏడుస్తుందా టీనేజర్. అర్ధరాత్రి ఇంట్లోంచి వెళ్లిపోయి చెరువులో దూకుతుండగా పోలీసులు అడ్డుకున్నారామెను. కొద్దిసేపు అమె చెప్పేదేమీ అర్థంకాలేదు వారికి. ``నువ్వు దూకకపోతే.. అమ్మెలా చనిపోతుంది?`` అని అడిగారు. కత్తితో గీసుకుందేమో ఆమె మణికట్టు మీద తిమింగళం లాంటి బొమ్మ ఉంది. ``ఇదంతా గేమ్ అంకుల్. గేమ్ పూర్తిచేయాలంటే నేను నదిలో దూకాలి. ఆట పూర్తిచేయకపోతే అమ్మ చచ్చిపోతుంది`` అంటూ ఆ అమ్మాయి చెప్పిన మాటలు విని వారంతా విస్తుపోయారు.

ప్రాణాంతక క్రీడ బ్లూవేల్ చాలెంజ్ గేమ్ పిల్లల్ని, టీనేజర్లను ఎలా లోబర్చుకుని హతమారుస్తుందో తెలియడానికి ఇదే పెద్ద ఉదాహరణ. పసి మనసుల్ని ఎంత మానసిక దౌర్బల్యానికి గురిచేస్తుందో తెలియజేసే ఈ ఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ పట్టణంలో జరిగింది. ఓ బీఎస్‌ఎఫ్ జవాన్ కుమార్తె అయిన 17 ఏళ్ల‌ బాలిక సోమవారం అర్ధరాత్రి మార్కెట్‌కు వెళ్తున్నానని చెప్పి తన స్కూటీ తీసుకుని బయల్దేరింది. ఎంతకూ తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యులు ఆమెకు ఫోన్‌చేశారు. ఆ ఫోన్‌ను గుర్తుతెలియని వ్యక్తి లిప్ట్ చేయడంతో వారు మరింత ఆందోళనకు గురయ్యారు. ఊరంతా వెతికారు. వారికి తమ సమీపంలోని కయ్లానా సరస్సు వద్ద ఆమె స్కూటీ కనిపించింది. వారు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో ఆ బాలిక కొండపైకి ఎక్కుతూ కనిపించడంతో ఆమెను కిందకు రమ్మని అందరూ పిలిచారు. అయినప్పటికీ ఆమె ముందుకు వెళ్లి చెరువులోకి దూకేసింది. వెంటనే కానిస్టేబుల్ ఓంప్రకాశ్ నీటిలోకి దూకి ఆమెను రక్షించాడు. తల్లిదండ్రులకు ఆ బాలికను అప్పగించారు.

ఒడ్డుకు చేర్చిన తర్వాత కూడా ఆమె ఏడుస్తూనే ఉంది. అమ్మ చనిపోతుందని చెప్పింది. అలా ఎందుకు జరుగుతుందని అడుగగా, ``నేను ఆడుతున్న బ్లూవేల్ చాలెంజ్ గేమ్ చివరికి వచ్చేసింది. ఈ టాస్క్ నేను పూర్తి చేయాలి. చెరువులోకి దూకకపోతే అమ్మ చనిపోతుంది``అని చెప్పింది అని కానిస్టేబుల్ ఓం ప్రకాశ్ చెప్పారు. రాత్రి 11 గంటల సమయంలో తమకు ఫోన్ వచ్చిందని, తాము సరైన సమయంలో అక్కడికి చేరుకోవడం వల్లే అనర్థం తప్పిందని పోలీస్ అధికారి లేఖరాజ్ సిహాగ్ తెలిపారు. గేమ్‌లో భాగంగా నదిలోకి దూకాలని, లేకపోతే మీ తల్లికి, కుటుంబసభ్యులకు ప్రమాదం వాటిల్లుతుందని బ్లూవేల్ మెంటార్స్ హెచ్చరించడం వల్లే బాలిక ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిందని పోలీసులు చెప్తున్నారు. దీంతో షాక్ తిన‌డం పోలీసుల వంతు అయింది.

మ‌రోవైపు బ్లూవేల్ చాలెంజ్ గేమ్ బారిన పడిన ఓ విద్యార్థిని పోలీసులు రక్షించారు. కటక్‌కు చెందిన అభినవ్ బిద్నాసి ఇంజినీరింగ్ మూడోసంవత్సరం చదువుతున్నాడు. అభినవ్ బ్లూవేల్ గేమ్ ఆడుతున్నాడని గమనించిన స్నేహితుడు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అభినవ్ ఉంటున్న మెస్‌కు వెళ్లి ఆయన గదిని సోదా చేశారని, ఆయన బ్లూవేల్ చాలెంజ్ గేమ్ ఆడుతున్నట్లు గుర్తించారని కటక్ నగర డీసీపీ అఖిలేశ్వర్ ప్రసాద్ తెలిపారు. అభినవ్‌కు కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసులు కియోంజార్ జిల్లాలో ఉంటున్న ఆయన తల్లిదండ్రులకు సమాచారమందించారు. ఇదిలాఉండ‌గా... చిన్నారులను బలిగొంటున్న బ్లూవేల్ గేమ్‌ను నిషేధించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వెల్లడించారు. ఈ గేమ్ నిషేధానికి అవసరమైన చర్యలు చేపట్టాలని హోంశాఖకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. బ్లూవేల్ ఆట కారణంగా చిన్నారులు, యువత ఆత్మహత్యకు పాల్పడుతుండటం ఆందోళనకరమని, ఇలాంటి మృత్యుక్రీడలకు అడ్డుకట్ట వేయాల్సి ఉందని మంగళవారం ఆయన అహ్మదాబాద్‌లో మీడియాకు తెలిపారు. ఈ గేమ్‌ను నిషేధించేందుకు అవసరమైతే రాష్ట్రప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకువస్తుందన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు