బ్రిక్స్‌లో మోడీ టైమింగ్‌,రైమింగ్ అదిరింది

బ్రిక్స్‌లో మోడీ టైమింగ్‌,రైమింగ్ అదిరింది

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప్ర‌సంగం శైలి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. వేదిక ఏదైనా టైమింగ్, రైమింగ్‌తో మోడీ అతిథుల‌ను ఉత్సాహ‌ప‌ర్చ‌గ‌ల‌రు. దౌత్యప‌ర‌మైన అంశాల్లో మోడీజీ డైన‌మిజం కూడా ప్ర‌త్యేకం. తాజాగా చైనాలోని షియామెన్‌లో జ‌రుగుతున్న బ్రిక్స్ దేశాల స‌ద‌స్సులో మాట్లాడుతూ ఇదే రీతిలో ఆక‌ట్టుకున్నారు. డైలాగ్ ఆఫ్ ఎమ‌ర్జింగ్ మార్కెట్ అండ్ డెవ‌ల‌పింగ్ కంట్రీస్ అన్న అంశంపై మాట్లాడుతూ స‌బ్‌కా సాత్‌, స‌బ్ కా వికాస్ అన్న ఎజెండాతోనే బ్రిక్స్ దేశాలు ముందుకు వెళ్తున్నాయ‌ని ప్ర‌ధాని మోడీ అన్నారు. ఉగ్ర‌వాద నిర్మూల‌న‌, సైబ‌ర్ భ‌ద్ర‌త‌, విప‌త్తు నిర్వ‌హ‌ణ లాంటి అంశాల‌పై బ్రిక్స్ దేశాల మ‌ధ్య‌ స‌హ‌కారం అవ‌స‌ర‌మ‌ని మోదీ అన్నారు. ప‌చ్చ‌టి ప్ర‌పంచాన్ని సాధించేందుకు అంద‌ర‌మూ క‌లిసి ప‌నిచేయాల‌ని, దాని ద్వారానే వాతావ‌ర‌ణ మార్పులను అడ్డుకోగ‌ల‌మ‌న్నారు.

పాశ్చాత్య దేశాల త‌ర‌హాలోనే బ్రిక్స్ దేశాలు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఏర్పాటు చేయాల‌ని ప్ర‌ధాని మోడీ సూచించారు. డిజిట‌ల్ ప్ర‌పంచం, నైపుణ్య ప్ర‌పంచ, ఆరోగ్య‌క‌ర ప్ర‌పంచం కోసం బ్రిక్స్ దేశాలు క‌లిసి క‌ట్టుగా ప‌నిచేయాల‌న్నారు. బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన నాలుగు ఒప్పందాలపై బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా సంతకాలు జరిగాయి.

పరిశోధనల్లో సహకారం, ఆర్థిక, వాణిజ్య సహకారంలో కార్యాచరణ ప్రణాళికతో పాటుగా పరిశోధనలు, కస్టమ్స్, వాణిజ్యమండలి ఏర్పాటు తదితర అంశాలపై ఈ ఒప్పందాలు కుదిరాయి. బ్రిక్స్ ఆర్థిక సహకార ప్రణాళిక అమలుకు చైనా 7.6 కోట్ల (భారత కరెన్సీలో రూ.478 కోట్లు) డాలర్లు సమకూర్చనున్నది. అలాగే బ్రిక్స్ స్థాపించిన న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ కార్యకలాపాల నిమిత్తం మరో 40 లక్షల డాలర్లు (రూ.25 కోట్లు) ఇవ్వనున్నది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ బ్రిక్స్ ప్లీనరీ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ వివరాలను ప్రకటించారు. అంతర్జాతీయ శాంతి, అభివృద్ధికి బ్రిక్స్ దేశాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మ‌రోవైపు బ్రిక్స్ సమావేశాలకు హాజరవుతున్న ప్రధాని నరేంద్రమోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మంగళవారం విడిగా సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుపుతారు. డోక్లాం వివాదం తర్వాత రెండు దేశాల అధినేతలు కలుసుకోవడం ఇదే తొలిసారి. మయాన్మార్‌కు బయలుదేరే ముందు ప్రధాని మోడీ మధ్యాహ్నం 12.30 గంటలకు జిన్‌పింగ్‌తో సమావేశమవుతారని భారత విదేశాంగశాఖ అధికారులు తెలిపారు. అయితే చర్చాంశాలు వెల్లడించేందుకు వారు నిరాకరించారు. ఇటీవల సిక్కిం సమీపంలోని డోక్లాంలో భారత, చైనా దళాలు నువ్వానేనా అన్నట్టుగా మోహరించడంతో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తిన సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు