వంగ‌వీటిపై వైసీపీలో ఎందుకీ క‌ల‌కలం?

వంగ‌వీటిపై వైసీపీలో ఎందుకీ క‌ల‌కలం?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెల‌కొన్న అంత‌ర్గ‌త స‌మస్య‌ను వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదిలోనే తుంచేశారు. పార్టీ నేత‌ల‌కు రంగంలోకి దించి వివాదానికి చెక్ పెట్టారు. వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ నాయకుడు గౌతం రెడ్డి విజయవాడలో ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. వాటి ప్రోమోలు విడుదల చేయ‌గా అందులో వంగవీటి రంగా, రాధాలను ఉద్దేశించి చేసిన అభిప్రాయాలను ఇబ్బందిక‌రంగా ఉన్నాయ‌ని ప‌లు వ‌ర్గాలు త‌మ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశాయి. ఈ నేప‌థ్యంలో వంగవీటి రంగాపై ఇబ్బందిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసిన తీరును వైఎస్ జ‌గ‌న్ త‌ప్పుప‌ట్టిన‌ట్లు తెలుస్తోంది.

వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి పార్థసారధి ఈ విష‌య‌మై మీడియాకు క్లారిటీ ఇచ్చారు. వంగ‌వీటి రంగాను ఉద్దేశించి గౌతం రెడ్డి చేసిన వ్యాఖ్యలన్నీ ఆయన వ్యక్తిగతమని, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని పార్థసారధి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వంగవీటి మోహన రంగా గురించి గౌతం రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పార్టీ తీవ్రంగా పరిగణించిందని ఈ సందర్భంగా ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేయటం జరిగిందని పార్థసారధి తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీలో ఏ స్థాయి నాయకుడైనా సరే..ఏ వ్యక్తి గురించి కానీ, ఏ వర్గం గురించి కించపరిచి మాట్లాడితే తీవ్రంగా పరిగణించబడుతుందని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారని ఈ సందర్భంగా పార్థసారధి తెలిపారు. దివంగత నాయకుడు వంగవీటి రంగాను, పార్టీ నాయకుడు మల్లాది విఘ్ణ గురించి చేసిన అభిప్రాయాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అంతేకాకుండా దివంగత నాయకుడు వంగవీటి రంగాను తామందరం అభిమానిస్తామని, రాష్ట్రంలోని పేదవర్గాలు కూడా ఆయన వ్యక్తిత్వాన్ని అభిమానిస్తారని తెలిపారు.

ఈ సంద‌ర్భంగా మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ప్రస్తుతం వైఎస్ఆర్ జిల్లా పర్యటనలో ఉన్నారని, న‌గ‌రానికి వచ్చిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పటికే షోకాజ్ నోటీసులు ఇచ్చామని పార్థసారధి తెలిపారు. ఇంటర్వ్యూను ప్రసారం చేయబోయే ఛానల్ కూడా పార్టీ అభిప్రాయం తెల్సుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామని ఆయన అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు