బ్లూవేల్‌.. చెన్నై దాకా వ‌చ్చేసింది

బ్లూవేల్‌.. చెన్నై దాకా వ‌చ్చేసింది

దేశం నుంచి తరిమేయాలని ఎవరెంత ప్రయత్నించినా... సాక్షాత్తూ కేంద్రమే జోక్యం చేసుకున్నా బ్లూవేల్ గేమ్‌ పంజా విసురుతూనే ఉంది. ఈసారి ఈ మృత్యు క్రీడకు తమిళనాడు విద్యార్థి బలైపోయాడు. చెన్నై తిరుమంగళం ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల విద్యార్థి విగ్నేష్‌ బుధవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మదురైలోని మన్నార్‌ కాలేజీలో ఇంటర్‌ చదువుతున్న అతని చేతిపై తిమింగలం గుర్తు ఉంది. దాని కింద బ్లూవేల్‌ అని రాసి ఉందని పోలీసులు ధ్రువీకరించారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో ఉరేసుకొని కనిపించిన విగ్నేష్‌ రాసిన లేఖ కూడా సంఘటనా స్థలంలో దొరికింది.

'బ్లూ వేల్‌.. ఇది గేమ్‌ కాదు ప్రమాదం. ఒక్కసారి ప్రవేశిస్తే.. నువ్విక బయటపడలేవు' అని రాసి ఉంది. విగ్నేష్‌ తన ఫోన్‌లో బ్లూవేల్‌ చాలెంజ్‌ గేమ్‌ కోసం ప్రయత్నిస్తూ కనిపించేవాడని అతని స్నేహితులు చెబుతున్నారు. బ్లూవేల్‌ చాలెంజ్‌ గేమ్‌ కోసం యాప్ కానీ, వెబ్‌సైట్‌ కానీ లేని నేపథ్యంలో మెసేజ్‌లు, ఫోన్‌కాల్స్‌ ద్వారా అతను బ్లూవేల్‌ ఆడేందుకు ప్రయత్నించాడని, క్యూరేటర్‌ ద్వారా అతని టాస్కులు అందేవని స్నేహితులు అంటున్నారు. ఈ సమాచారాన్ని బట్టి తమిళనాడులో ఇది తొలి బ్లూవేల్‌ మరణమని అనుమానిస్తున్నారు. బ్లూవేల్ చాలెంజ్‌ గేమ్‌పై తమిళనాడు పోలీసులు ఇప్పటికే తల్లిదండ్రులను హెచ్చరించారు. కంప్యూటర్లు, మొబైల్‌ఫోన్లు వాడే పిల్లలపై ఓ కంట నిఘా వేసి ఉంచాలని సూచించారు.

బ్లూ వేల్‌ ఛాలెంజ్‌ అనేది ఓ ఆన్‌లైన్‌ గేమ్‌. యువతను, చిన్నారులే లక్ష్యంగా సాగుతుంది. దీన్ని రిజిస్టర్‌ చేసుకున్నవాళ్లు 50 రోజల పాటు ఏదో ఒక టాస్క్‌ చేయాల్సి ఉంటుంది. చేసిన ప్రతి టాస్క్‌కు వీడియో సహిత ఆధారాలను చూపించాల్సి ఉంటుంది. గేమ్‌ ప్రారంభంలో చిన్న చిన్న టాస్క్‌లే ఇస్తారు. కానీ, రోజులు గడిచే కొద్దీ వికృతమైన ఆదేశాలు జారీ చేస్తారు. తెల్లవారుజామునే భయానక వీడియోలు చూడమని, చేతులు, చేతి మీద కోసుకోమని.. రకరకాల టాస్క్‌లు ఇస్తారు.

అలా ఏదో ఒక రోజు మీరు చనిపోవాలనుకుంటున్న తేదీ చెప్పమంటారు. ఇక్కడున్న మనుషుల్ని ఎక్కడో ఉన్న వారి ఆధీనంలోకి తెచ్చుకుంటారు. చివరకు ఆత్మహత్యకు ఉసిగొలుపుతారు. ఇప్పటికే ఈ రాకాసి క్రీడకు ఎందరో చిన్నారులు, యువకులు బలైపోయారు. ఈ గేమ్ లింకులు అందకుండా చర్యలు తీసుకోవాలని పార్లమెంటులోనూ సభ్యులు ఆందోళన లేవనెత్తారు. ప్రభుత్వం కూడా ఈ మృత్యు క్రీడను దేశం నుంచి తరిమేస్తామని ప్రకటించింది. కానీ ఇప్పటికీ బ్లూవేల్ మరణాలు కొనసాగడం ఆందోళన కలిగిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు