చుడీదార్లు, చావు క‌బుర్లే ముంచేశాయ్‌!

చుడీదార్లు, చావు క‌బుర్లే ముంచేశాయ్‌!

హోరాహోరీగా జ‌రిగిన నంద్యాల ఉప ఎన్నిక‌లో ఫ‌లితం  వైసీపీకి వ్య‌తిరేకంగా వ‌చ్చింది. నెల రోజుల పాటు అధికార‌, ప్ర‌తిప‌క్షాలు నంద్యాల‌లో పోటాపోటీగా ప్ర‌చారం చేశాయి. ఇరు పార్టీల అధినేత‌లు నంద్యాల ఓట‌ర్ల‌ను త‌మ మాట‌ల గార‌డీతో ఆక‌ట్టుకునేందుకు ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేసుకున్నారు. అయినా, ప్ర‌జ‌లు అధికార టీడీపీనే గెలిపించాయి. క‌ర్ణుడి చావుకు కార‌ణాలు అనేకం...అన్న త‌ర‌హాలో త‌మ‌ ఓట‌మికి కూడా అనేక కార‌ణాలున్న‌ట్లు ప్ర‌తిప‌క్షం ఆరోపిస్తోంది. అయితే, వైసీపీ ఓట‌మికి ఆ పార్టీ అధ్య‌క్షుడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఎమ్మెల్యే రోజాల వ్యాఖ్య‌లే కార‌ణ‌మ‌ని స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. నంద్యాల‌లో వారిద్ద‌రి వ్యాఖ్య‌ల‌తో వైసీపీ సెల్ఫ్ గోల్ వేసుకుంద‌ని ప‌లువురు అభిప్రాయ ప‌డుతున్నారు.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ప్ర‌త్య‌ర్థుల‌పై విమ‌ర్శ‌లు, ఒక స్థాయి వ‌ర‌కు వ్య‌క్తిగ‌త ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌ర్వ సాధార‌ణం. అయితే, నంద్యాల‌లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ఏపీ సీఎం చంద్ర‌బాబుపై  వైసీపీ అధ్య‌క్షుడు జ‌గ‌న్ అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. సీఎం చంద్ర‌బాబును న‌డిరోడ్డుపై కాల్చి చంపినా త‌ప్పు లేదంటూ జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌ల‌పై పెను దుమారం రేగింది. ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రిపై ప్ర‌తిప‌క్ష నేత హోదాలో ఉన్న జ‌గ‌న్ ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేయ‌డం టీడీపీకి అనుకూలించింది. గ‌తంలో కూడా చంద్ర‌బాబుపై జ‌గ‌న్ ప‌లు వ్యాఖ్య‌లు చేసిన‌ప్ప‌టికీ ఓట్ల కోసం ఈ ర‌కంగా చావు క‌బుర్ల‌ను ప్ర‌చారం చేయడాన్ని నంద్యాల ప్ర‌జ‌లు జీర్ణించుకోలేక పోయారు. చంద్ర‌బాబాను త‌గ‌ల‌బెట్ట‌మంటూ జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ప్ర‌జ‌లు ఆమోదించ‌లేదు. అంత‌టితో ఆగ‌కుండా, టీడీపీ నేత ఆదినారాయ‌ణ రెడ్డిని బ‌ట్ట‌లూడ‌దీసి కొట్టాలంటూ వ్యాఖ్యానించ‌డం జ‌గ‌న్ పై ఉన్న వ్య‌తిరేక‌త‌ను మ‌రింత పెంచాయి. ఈ త‌ర‌హా నెగ‌టివ్ కామెంట్స్ చేయ‌డం వైసీపీకి మైన‌స్ అయింది.

వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న రోజా సంద‌ర్భాన్ని బ‌ట్టి ఏపీ సీఎం చంద్ర‌బాబుపై, టీడీపీపై త‌న వ్యాఖ్య‌ల‌తో విరుచుకుప‌డుతుంటారు. అయితే, ఈ సారి ఆమె మంత్రి అఖిల ప్రియ వ‌స్త్ర ధార‌ణ పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఆమె చుడీదార్ లు ధ‌రించి వ‌స్తుంద‌ని రోజా పాయింట్ అవుట్ చేయడం పై మ‌హిళ‌ల‌తో స‌హా స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఈ రోజుల్లో దాదాపుగా ప్ర‌తి ఇంట్లో చుడీదార్ ధ‌రించే ఆడ‌పిల్ల‌లు ఉన్నారు. అందులోనూ చుడీదార్ అస‌లు అభ్యంత‌ర‌క‌ర డ్రెస్ కాక‌పోయినా, కేవ‌లం అఖిల‌ప్రియ‌ను టార్గెట్ చేయ‌డం కోస‌మే రోజా వ్య‌క్తిగ‌త వ‌స్త్ర ధార‌ణ‌పై విమ‌ర్శ‌లు గుప్పించ‌డం చాలా మందికి న‌చ్చ‌లేదు. ఆ మాట‌కొస్తే వైసీపీ అధినేత జ‌గ‌న్ భార్య భార‌తి, ష‌ర్మిల‌ కూడా ఎక్కువ‌గా చుడీదార్ లే ధ‌రిస్తారు. ఈ విష‌యాన్ని విస్మ‌రించిన రోజా ఆ విధంగా కామెంట్స్ పాస్ చేయ‌డం వైసీపీకి మైన‌స్ అయింది. చాలామంది స‌ర్వ‌సాధార‌ణంగా ధ‌రించే చుడీదార్ల‌పై రోజా కామెంట్లు తీవ్ర ప్ర‌భావాన్ని చూపాయి.

మ‌హిళ‌లు రోజా చుడీదార్ వ్యాఖ్య‌ల‌ను త‌మ‌కు అన్వ‌యించుకున్నారు. మ‌హిళా లోకాన్ని రోజా కించ‌ప‌రిచిన‌ట్లుగా భావించారు. మ‌హిళ‌లు చుడీదార్ ధ‌రించ‌డం త‌ప్పు అన్న రీతిలో రోజా వ్యాఖ్య‌లుండ‌డంతో చాలా మంది మ‌హిళ‌లు వైసీపీకి వ్య‌తిరేకంగా ఓటు వేశారు. ఈ విధంగా, జ‌గ‌న్‌, రోజాల‌...చుడీదార్లు, చావు క‌బుర్లే వైసీపీ కొంప ముంచాయ‌ని పలువురు రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు