పవన్ లేకున్నా.. తెదేపాకు ఫరక్ లేదు !

పవన్ లేకున్నా.. తెదేపాకు ఫరక్ లేదు !

తెలుగుదేశం పార్టీ గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి గద్దె ఎక్కిందంటే... పవన్ కల్యాణ్ పుణ్యమే అని వాదించే వాళ్లు చాలా మందే ఉంటారు. అయితే.. కేవలం పవన్ ఫ్యాక్టర్ ఒక్కటే విజయం దరి చేర్చబోదని, పవన్ ప్రభావం ఇసుమంత లేకపోయినా సరే.. తెలుగుదేశం తన సొంత బలంతోనే నెగ్గగలదని నంద్యాల ఉప ఎన్నిక నిరూపించింది. పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేయకపోయినా, కనీసం మద్దతు ప్రకటించకపోయినా, ట్వీట్ చేయకపోయినా కూడా.. తెదేపా నంద్యాలలో ఘన విజయాన్నే నమోదు చేస్తున్నది.

భూమా నాగిరెడ్డి కుటుంబంతో తనకు వ్యక్తిగతంగా కూడా సాన్నిహిత్యం ఉన్నప్పటికీ.. ఆయన మరణం నేపథ్యంలో జరుగుతున్న ఉప ఎన్నికలో ఆయన కుటుంబం తరఫున ప్రచారానికి పవన్ కల్యాణ్ మొగ్గు చూపించలేదు. పైగా నంద్యాల ఉప ఎన్నిక విషయంలో తమ పార్టీ తటస్థంగా ఉంటుందంటూ పనిగట్టుకుని స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. తెదేపాకు గత ఎన్నికల్లో ప్రచారం చేసిన పవన్ కల్యాణ్, ఆ పార్టీ పాలన పట్ల అసంతృప్తితో ఉన్నారనడానికి ఇది నిదర్శనం అంటూ ప్రత్యర్థులు బాగా ప్రచారం చేసుకున్నారు.

ఒకరకంగా తెదేపానుంచి పవన్ కల్యాణ్ దూరం జరుగుతున్నారనడానికి ఇది శ్రీకారం అన్నట్లుగా కూడా ప్రచారం జరిగింది. ఆ రకంగా పవన్ ఫ్యాక్టర్ తెదేపాకు ఉపయోగపడే పరిస్థితి తొలగిపోయింది. అయినా సరే.. తెలుగుదేశం ఘన విజయాన్ని నమోదు చేయడం విశేషం. పవన్ కల్యాణ్  మద్దతు లేకపోయినా.. తెలుగుదేశానికి కొత్తగా వచ్చే ఇబ్బంది ఏమీ లేదని, ప్రజల ఆదరణ తమ వెన్నంటి ఉందని ఆ పార్టీ నాయకులు ఇప్పుడు చెప్పుకుంటున్నారు.

వచ్చే ఎన్నికల నాటికి ఈ సమీకరణాల ప్రభావం చాలా నే ఉంటుందని కూడా భావిస్తున్నారు. ఈ విజయం పవన్ కల్యాణ్ ఎప్రోచ్ లో కూడా తేడా తీసుకువస్తుందేమో అని భావిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు