భూమా మౌనికవి మాటలు కావు.. తూటాలే

భూమా మౌనికవి మాటలు కావు.. తూటాలే

దేనికైనా టైం రావాలంటారు. మొన్నామ‌ధ్య తండ్రిని పోగొట్టుకున్న పుట్టెడు శోకంతో మునిగిన భూమా నాగిరెడ్డి పిల్ల‌ల్ని చూసిన ప‌లువురు అయ్యో అనుకోకుండా ఉండలేక‌పోయారు. పెద్ద కుమార్తె భూమా అఖిల మిన‌హా మిగిలిన ఇద్ద‌రు పిల్ల‌లు త‌ల్లిదండ్రుల్ని పోగొట్టుకొని రోదిస్తున్న వైనం ప‌లువురిని క‌దిలించేసింది. ఇంత చిన్న పిల్ల‌లు.. రాజ‌కీయాల్ని ఎలా ఏల‌గ‌ల‌రు? న‌ంద్యాల.. ఆళ్ల‌గ‌డ్డ లాంటి క‌రకు నేల మీద రాజ‌కీయాలు చేసే స‌త్తా వారిలో ఉందా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి.

అయితే.. వీటిని ప‌టాపంచ‌లు చేస్తూ.. త‌మ స‌త్తాను చాటారు భూమా పిల్ల‌లు. ఏదో అక్క‌చాటు చెల్లెలు అనుకున్న భూమా మౌనిక మాట‌లు ఇప్పుడు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా మారాయి. ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా తూటాల్లాంటి మాట‌ల‌తో చెల‌రేగిపోయిన వైనం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాయి. త‌న‌కునోరు ఎక్కువ‌ని.. త‌న అక్క అఖిల‌ప్రియ‌కు బ్రెయిన్ ఎక్కువ‌ని చెప్పే మౌనిక తాజాగా ఓట్ల లెక్కింపు సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడి త‌న మార్క్‌ను ప్ర‌ద‌ర్శించారు.

రాజ‌కీయాల్లోకి ఎప్పుడువ‌స్తార‌న్న ప్ర‌శ్న‌కు.. తాను పుట్టిన‌ప్ప‌టి నుంచే రాజ‌కీయాల్లో ఉన్నాన‌ని.. నంద్యాల‌.. ఆళ్ల‌గ‌డ్డ రెండు నియోజ‌క‌వ‌ర్గాలు త‌మ‌వేన‌న్న ఆమె.. త‌న తండ్రి త‌న‌కు వార‌స‌త్వంగా ప్ర‌జా స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించ‌మ‌న్నారని చెప్పటం విశేషం. ప్ర‌జా స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించే సామ‌ర్థ్యం త‌న‌కుంద‌న్న మౌనిక‌.. త‌మ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి శిల్పా మోహ‌న్‌రెడ్డిపై విమ‌ర్శ‌లు చేశారు. త‌న తండ్రి హ‌యాం నుంచి మాట మీద నిల‌బెట్టే త‌త్త్వం శిల్పాకు లేద‌న్నారు.

ఎన్నిక‌ల్లో ఓడిపోతే  రాజ‌కీయ స‌న్యాసం చేస్తాన‌ని స‌వాలు విసిరిన ఆయ‌న గ‌తంలోనూ మాట త‌ప్పాడ‌ని.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌ల్లోనూ మ‌రోసారి మాట త‌ప్ప‌టం ఖాయ‌మ‌న్నారు. రాజ‌కీయాల్లో కొన‌సాగేందుకు ఏదో కార‌ణం వెతుకుతాడ‌న్న మౌనిక మాట‌లు తూటాల మాదిరిగా ఉన్నాయ‌న్న అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు