షాక్‌: ఏపీ స‌చివాల‌యంలో సూసైడ్‌

షాక్‌: ఏపీ స‌చివాల‌యంలో సూసైడ్‌

ఊహించ‌ని ప‌రిణామం ఒక‌టి ఏపీ స‌చివాల‌యంలో చోటు చేసుకుంది. త‌న‌కున్న క‌ష్టాలు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు చెప్పుకుందామ‌ని వ‌చ్చిన ఆర్ ఎంపీ వైద్యుడు ఒక‌రు.. సీఎంను క‌లిసే అవ‌కాశం లేక‌పోవ‌టంతో జీవితంపై విరక్తి చెందిన స‌చివాల‌యంలోనే సూసైడ్ చేసుకోవ‌టం క‌ల‌క‌లం రేపింది.

నెల్లూరు జిల్లాకు చెందిన ఆర్ ఎంపీ వైద్యుడు రాజ‌గోపాల్ శుక్ర‌వారం ఏపీ రాష్ట్ర స‌చివాల‌యానికి వ‌చ్చారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును క‌లిసేందుకు అపాయింట్ మెంట్ కోసం ప్ర‌య‌త్నించారు. శుక్ర‌వారం ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కూ ఆయ‌న వెల‌గ‌పూడిలోని స‌చివాల‌యం వ‌ద్ద వెయిట్ చేశారు.

అయితే.. సీఎంను క‌లిసేందుకు అధికారులు ఒప్పుకోలేదు. త‌న‌ను వెంటాడుతున్న క‌ష్టాల్ని సీఎంతో చెప్పుకోవాల‌ని వ‌స్తే.. ఆయ‌న్ను క‌లిసేందుకు అధికారులు అవ‌కాశం ఇవ్వ‌క‌పోవ‌టంతో విర‌క్తి చెందిన ఆర్ ఎంపీ వైద్యుడు త‌న‌తో తెచ్చుకున్న పురుగుల మందును తాగాడు.

ఊహించ‌ని రీతిలో జ‌రిగిన ఈఘ‌ట‌న‌తో స‌చివాల‌య సిబ్బంది షాక్ తిన్నారు. పురుగుల మందు తాగుతున్న రాజగోపాల్‌ను అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించారు. కానీ.. అప్ప‌టికే అత‌ను పురుగులు మందు తాగ‌టంతో హుటాహుటిన వైద్య‌సేవ‌ల కోసం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న రాజ‌గోపాల్ ఈ రోజు (శ‌నివారం) తెల్ల‌వారుజామున మృతి చెందారు. సీఎంను క‌లిసేందుకు ప్ర‌య‌త్నించి.. అపాయింట్ మెంట్ దొర‌కని కార‌ణంగా ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్న తీరును ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు