ప‌వ‌న్ నిర్ణ‌యం సూప‌ర్ అంటున్న భూమ కుమార్తె

ప‌వ‌న్ నిర్ణ‌యం సూప‌ర్ అంటున్న భూమ కుమార్తె

నంద్యాల ఉప ఎన్నిక‌లో ఎవ‌రికీ మ‌ద్ద‌తు ఇవ్వ‌కుండా తటస్థంగా ఉండనున్నట్లు జనసేన అధినేత‌ పవన్ కల్యాణ్ నిర్ణయం ప‌లు వ‌ర్గాల‌కు ఆస‌క్తిని క‌లిగించిన సంగ‌తి తెలిసిందే. రాబోయే ఎన్నిక‌ల్లో రాయ‌ల‌సీమ నుంచి పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించిన ప‌వ‌న్....తాజాగా అంద‌రి దృష్టి కేంద్రీకృత‌మై ఉన్న నంద్యాల ఉప ఎన్నిక విష‌యంలో అస్ప‌ష్ట‌త పాటించారనే భావ‌న ప‌లువురిలో ఉంది. అభ్య‌ర్థిని బ‌రిలో దింపే విష‌యంలో జాప్యం చేయ‌డ‌మే కాకుండా త‌మ మ‌ద్ద‌తు విష‌యంలోనూ ఆల‌స్యంగా స్పందించారని ప‌లువురు అంటున్నారు. అయితే ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ స్పందిస్తూ త‌మ మ‌ద్ద‌తు ఎవ‌రికీ లేద‌ని తెలిపారు. కాగా, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌ను దివంగ‌త భూమానాగిరెడ్డి-శోభా నాగిరెడ్డి వార‌సులు స్వాగతించారు. అంతేకాకుండా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏం చేయాలో కూడా చెప్పారు.

భూమా నాగిరెడ్డి కుమార్తె, మంత్రి భూమా అఖిలప్రియ సోదరి భూమా మౌనికారెడ్డి మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నిక విష‌యంలో ప‌వ‌న్ నిర్ణ‌యాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. పవన్ అభిమానుల మద్దతు తమకే ఉంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ విధివిధానాలు ఇంకా రూపొందించలేదని, అందుచేత ఆయన మద్దతు తెలపలేని స్థితిలో ఉన్నారని అన్నారు. పవన్ కల్యాణ్ ప్రజలకు సేవ చేయాలనే దృక్పదంతో రాజకీయాల్లోకి వచ్చారని, భూమా కుటుంబం కూడా అదే ఆలోచనలో ఉందని మౌనికా రెడ్డి అన్నారు. మంచి భావన ఉండేవారికి జనసేన పార్టీ ఎప్పుడూ తోడుగా ఉంటుందని తాను గట్టిగా నమ్ముతున్నానని ఆమె అన్నారు. స్థూలంగా జ‌నసేన పార్టీ, భూమా కుటుంబం ప్రజలకు మంచి చేయాలనే ఉందని అన్నారు.

ఈ సంద‌ర్భంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏం చేయాల్సి ఉందో కూడా భూమా నాగ‌రెడ్డి త‌న‌య‌ మౌనికా రెడ్డి సూచించారు. నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ఓట్లు అడుగుతున్న శిల్పా మోహ‌న్ రెడ్డి వైఖ‌రిని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌శ్నించాల‌ని ఆమె కోరారు. తొమ్మిదేళ్లు మంత్రిగా ఉన్న శిల్పా మోహన్ రెడ్డి నంద్యాల ప్రజలకు ఏం చేశారో పవన్ ప్రశ్నించాలని మీడియా ద్వారా ఆమె కోరారు. నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి త‌మ త‌ల్లిదండ్రులు ఎంతో కృషి చేశార‌ని, దాన్ని దృష్టిలో ఉంచుకొని టీడీపీ అభ్య‌ర్థిగా ఉన్న త‌మ సోద‌రుడిని ప్ర‌జ‌లు గెలిపిస్తార‌ని మౌనికారెడ్డి ధీమా వ్య‌క్తం చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు