అప్పుడు క‌స‌బ్‌కు!.. ఇప్పుడు మాల్యాకు!

అప్పుడు క‌స‌బ్‌కు!.. ఇప్పుడు మాల్యాకు!

స్వదేశంలో బ్యాంకుల‌కు అప్పులు ఎగ్గొట్టి.. విదేశాల్లో విలాస‌వంతంగా గ‌డుపుతున్న ఆర్థిక నేర‌గాడు లిక్క‌ర్ బ్యారన్ విజ‌య్‌మాల్యా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా వాటిని త‌న ద‌రిదాపుల్లోకి రానీయ‌కుండా త‌ప్పించుకుని తిరుగుతున్న `బ‌డా చోర్‌`ని తిరిగి భార‌త్‌కు ర‌ప్పించే దిశ‌గా చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఆఖ‌రి ద‌శ‌కు చేరుకున్నాయి. వేల కోట్ల రుణాలు ఎగ‌వేసి లండ‌న్‌లో దాక్కున్న ఆ ఎల‌కను ప‌ట్టుకునేందుకు కేంద్రం చేస్తున్న సంప్ర‌దింపులు ఫ‌లిస్తున్నాయి. నేడో రేపో.. ఆ ఆర్థిక ఉగ్ర‌వాదితో క‌ట‌క‌టాలు లెక్క‌పెట్టించ‌బోతున్నారు. దేశాన్ని అత‌లాకుతలం చేసిన‌.. ఉగ్ర‌వాది క‌స‌బ్‌ను ఉంచిన బ్యార‌క్‌లోనే అత‌డిని ఉంచేందుకు అధికారులు సిద్ధ‌మ‌వుతున్నారు.

లిక్క‌ర్ బ్యారన్ విజ‌య్ మాల్యాను భార‌త్‌కు ర‌ప్పించేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను కేంద్రం ముమ్మ‌రం చేసింది. బ్యాంకుల‌కు దాదాపు 9వేల కోట్ల రుణ ఎగ‌వేత‌ల‌కు పాల్ప‌డి.. లండ‌న్‌లో త‌ల‌దాచుకుంటున్న అత‌డిని.. భార‌త్‌కు తీసుకొచ్చేందుకు ఆ దేశ ప్ర‌భుత్వంలో కేంద్రం ఎడ‌తెగ‌ని చ‌ర్చ‌లు జ‌రుపుతున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఇవి కొలిక్కివ‌స్తున్నాయి. లండన్ కోర్టు మాల్యాను భారత్‌కు అప్పగించిన వెంటనే ఆయన్ను ముంబై ఆర్థర్‌ రోడ్ జైలుకు తరలించనున్నట్లు తెలుస్తోంది.

జైలు అధికారులు రూపొందించిన నివేదికను ప్రభుత్వం సీబీఐ ద్వారా మాల్యా అప్పగింత కేసును విచారిస్తున్న వెస్ట్‌మినిస్టర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టుకు సమర్పించింది. అర్థర్‌ రోడ్డు జైలులోని బ్యారక్‌ 12ను మాల్యాకు కేటాయించనున్నారు. గతంలో 2611 పేలుళ్ల సూత్రధారి, పాక్‌ ఉగ్రవాది అజ్మల్‌ కసబ్ ఇందులో ఉండ‌టం గ‌మ‌నార్హం. ముంబై మహాలక్షీ​ రేసు కోర్సుకు సమీపంలో ఉన్న అర్థర్‌ రోడ్‌ జైలు మాల్యాకి అవసరమైన భద్రత ప్రమాణాలన్నింటినీ కలిగి ఉందని లండన్‌ కోర్టుకు సమర్పించిన నివేదికలో ప్రభుత్వం పేర్కొంది. దీంతో మాల్యా అప్ప‌గింత ప్ర‌క్రియ ఇక వేగ‌వంతం అవుతుంద‌ని కేంద్రం భావిస్తోంది. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు