నరసింహ‌న్‌ను పంపించి ఆమెను గ‌వ‌ర్న‌ర్ చేస్తార‌ట‌

నరసింహ‌న్‌ను పంపించి ఆమెను గ‌వ‌ర్న‌ర్ చేస్తార‌ట‌

తెలుగు రాష్ర్టాల‌కు కొత్త గ‌వ‌ర్న‌ర్ రానున్నారా?  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ఉమ్మడి గవర్నర్ స్థానే వేర్వేరు గవర్నర్లను నియమించాలన్న ఆలోచన ఉన్నా కేంద్ర ప్ర‌భుత్వం ఈ మేర‌కు నిర్ణ‌యించిన‌ట్లు  తెలుస్తోంది.  ప్రస్తుత ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కశ్మీర్ వ్యవహారాలు చక్కదిద్దేందుకు ఏర్పాటు చేసే వ్యూహాత్మక కమిటీ కన్వీనర్‌గా నియమించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు పూర్తి కావడం, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కూడా ముగిసిపోవడంతో ఇక క్యాబినెట్‌లో మార్పులు, చేర్పులపై ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా దృష్టిని కేంద్రీకరించారు. స్వాతంత్య్ర వేడుకలు ముగిసిన తర్వాత వారం, పది రోజుల్లో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ, గవర్నర్ల నియామకం, బీజేపీలో సంస్థాగత మార్పులు ఒకటి తర్వాత మరొకటి పూర్తి చేయనున్నారు. 2019 ఎన్నికలతోపాటు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ర్టాల్లో పార్టీ విజయమే లక్ష్యంగా కొత్త మంత్రులు, గవర్నర్ల నియామకం, పార్టీ పదవుల ఎంపికపై ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కేంద్రీకరించారు. గుజరాత్ నుంచి తొలిసారి రాజ్యసభకు ఎన్నికైన అమిత్ షా పార్టీ అధ్యక్షుడిగా వచ్చే లోక్‌సభ ఎన్నికలపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. గుజరాత్ మాజీ సీఎం ఆనందీబెన్ పటేల్, కేంద్ర మంత్రి కల్‌రాజ్ మిశ్రాలను గవర్నర్లుగా నియమించే అవకాశం ఉంద‌ని స‌మాచారం. తెలుగు రాష్ర్టాల్లో ఏదో ఒక రాష్ట్రానికి ఆనందీబెన్‌ను పంపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

మనోహర్ పారికర్ గోవా సీఎంగా వెళ్లడం, వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నికవడం, అనిల్ మాధవ్ దవే మరణించడంతో వారు నిర్వహించిన శాఖలను ఇతర మంత్రులకు కేటాయించారు. డోక్లాంలో ఉద్రిక్తతలు నెలకొన్నా జీఎస్టీపైనే ప్రధానంగా దృష్టి సారించడంతో జైట్లీ పూర్తిస్థాయిలో రక్షణశాఖ బాధ్యతలు నిర్వహించలేకపోయారని బీజేపీ వ్యాఖ్యానించింది. దీంతో రక్షణశాఖకు పూర్తిస్థాయి మంత్రిని నియమిస్తారని తెలుస్తోంది. ఈశాన్య రాష్ర్టాల్లో పార్టీని అధికారంలోకి తేవడంలో కీలక పాత్ర పోషించిన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్, ఎంపీ భూపేంద్ర యాదవ్‌లకు క్యాబినెట్‌లో చోటు కల్పించడంగానీ, పార్టీలో కీలక బాధ్యతలు గానీ కేటాయించొచ్చు. హిమాచల్ ప్రదేశ్ సీఎం అభ్యర్థిగా కేంద్ర మంత్రి జేపీ నడ్డాను ఎంపికచేస్తే, ఆ శాఖను మరొకరికి కేటాయించే అవకాశముంది. దక్షిణాది రాష్ర్టాల్లో విస్తరణ కోసం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వారికి క్యాబినెట్‌లో చోటు కల్పించే ఆలోచన ఉన్నట్లు సమాచారం.

ఏపీలో విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబుకు సహాయ మంత్రి, అన్నాడీఎంకేలోని రెండు గ్రూపులు విలీనమైతే ఒక క్యాబినెట్, ఒక సహాయ మంత్రి పదవితోపాటు ఒడిశాలో పార్టీ బలోపేతానికి ఆ రాష్ట్ర నేతలకు మోదీ తన క్యాబినెట్‌లో చోటు కల్పిస్తారని వినికిడి. అలాగే జేడీయూకు ఒక మంత్రి పదవి ఇస్తారని వార్తలొచ్చాయి. తమిళనాడు గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావును ఆ రాష్ట్ర పూర్తిస్థాయి గవర్నర్‌గా నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English