జ‘గన్’ బుల్లెట్లు వాటిని తాకలేదెందుకో..?

జ‘గన్’ బుల్లెట్లు వాటిని తాకలేదెందుకో..?

సమైక్య శంఖారావం సభ సూపర్ హిట్ అయ్యిందన్న ఆనందంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అంతమంది జనం ఎలా వచ్చారా.. అని తెలంగాణ నేతలు తల్లడిల్లిపోతున్నారు. సమైక్య సభ పెడితే చించేస్తాం.. పగలదీస్తామని వార్నింగ్ ల మీద వార్నింగ్ లు ఇచ్చే టీఆర్ఎస్ నేతలు పత్తా లేరు. అదే సమయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడులను వరస పెట్టి మరీ కడిగేసినట్లు కలర్ ఇచ్చిన జగన్ ఎక్కడ ఆవేశం హద్దులు దాటలేదు. విమర్శలు మొత్తం వ్యూహాత్మకంగానే సాగాయి. సోనియాగాంధీ పౌరసత్వం మీద వ్యాఖ్యలు చేసి సరికొత్త చర్చకు తావిచ్చిన జగన్.. తన విమర్శల ధాటిని అక్కడితోనే అపారు.  అంతకు మించి ఆమెను ఒక్క మాట అనలేదు. అది కూడా తాము పడుతున్న ఇబ్బందిని.. ఆమెకు అర్థమయ్యే ఉదాహరణ ఇచ్చారనే అనుకోవాలి. ఇక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడుల మీద మాత్రం ఒంటికాలిపై ఎగిరెగిరి పడ్డారు. సమైక్యవాదంపై నిర్మాణాత్మకంగా ముందుకు సాగిపోతున్న చంద్రబాబునాయుడు పెద్దమనిషిలా వ్యవహరించటం జగన్ కు అస్సలు నచ్చటం లేదు. అందకు ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు విపరీతంగా ప్రయత్నించారు.

దాదాపు 45నిమిషాల జగన్ ప్రసంగంలో కావాలనే కొన్ని అంశాలను అస్సలు ప్రస్తావించకుండా చతురత ప్రదర్శించారు. రాష్ట్ర విభజనకు కర్త, కర్మ, క్రియ ఎవరు అని ప్రశ్నించుకుంటే వేళ్లు అన్నీ టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వైపే చూపిస్తాయి. కానీ.. విచిత్రంగా  ఆయన్ను ఒక్క మాట కూడా అనకుండా జగన్ జాగ్రత్త పడ్డారు. టీఆర్ఎస్ పార్టీని కానీ.. ఆ పార్టీ అధినేతను కానీ పల్లెత్తు మాట అనేందుకు కూడా జగన్ ఇష్టపడలేదు. అంతే కాదు కేంద్రమంత్రి చిరంజీవిని కూడా ఆయన ఏమీ అనలేదు. నిన్నమొన్నటి వరకు సమైక్యవాదాన్ని బలంగా వినిపించి.. ఇప్పుడు సోనియమ్మ మాటను తూచా తప్పకుండా ఫాలో అవుతున్న మెగాస్టార్ యూటర్న్ పైనకూడా ఆయన ఎలాంటి విమర్శలు చేయలేదు. అన్నింటికి మించి ఆసక్తికరమైన ఒక అంశం జగన్ ప్రసంగంలో కనిపిస్తుంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని నానా రకాలు విమర్శించిన ఆయన కీలకమైన ఒక విషయాన్ని కావాలనే ప్రస్తావించలేదనుకోవాలి. తెలుగు ప్రజలను విడగొట్టేందుకు సోనియమ్మ చూపిస్తున్న ఉత్సాహాన్ని ప్రశ్నించిన ఆయన.. రానున్న ఎన్నికల్లో తన లక్ష్యాన్ని కూడా బాహాటంగా చెప్పేశారు. 30 ఎంపీ సీట్లు ఇవ్వాలే కానీ.. కేంద్రంలో మన మాటే నెగ్గుతుందని స్పష్టం చేసిన ఆయన 2014 ఎన్నికల్లో ఎంపీ సీట్లే తనకు గురి అంటూ వెల్లడించారు. ఎన్నికలు.. దాన్లో కావాల్సిన సీట్ల గురించి ప్రస్తావించిన ఆయన.. ఆ సీట్లతో ఎవరికి మద్దతు ఇస్తానన్న విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు.

కాంగ్రెస్ పార్టీని దునుమాడిన జగన్.. మరి విభజన పాపానికి ఒడిగట్టినందుకు గాను.. తన బొందిలో ప్రాణం ఉండగా ఇంక ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీలో కలిసేది లేదని.. ఆ పార్టీతో ఎప్పటికీ పొత్తు పెట్టుకునే అవకాశం లేదని మాత్రం విస్పష్ట ప్రకటన మాత్రం చేయలేదు. అదే జగన్ రాజకీయ చాతుర్యంగా చెప్పాలి. తన గన్ తో విమర్శల తూటాలను ఇష్టారాజ్యంగా వదిలినట్లు కనిపించినా అవన్నీఆచితూచి జరిపిన ఫైరింగే తప్ప.. మరొకటి కాదు. తనకు రాజకీయంగా లబ్థిని చేకూర్చే అంశాల మీదనే జగన్ దృష్టి సారించారని చెప్పొచ్చు.